‘ఈనాడు’ బిగ్గెస్ట్ జోక్.! వైసీపీకి అభ్యర్థులే లేరట.!

మీకు తెలుసా.? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరట.! లేరంటే లేరని కాదుగానీ, పోటీ చేయడానికి ఎవరూ ఇష్టపడబోరట. అలాగని, తెలుగుదేశం పార్టీ అను‘కుల’ మీడియాకి చెందిన ‘ఈనాడు’ ఓ వార్తా కథనాన్ని వండి వడ్డించింది.

ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ అయి, రెండు పార్టీల మధ్యా పొత్తుని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో, ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాతోపాటు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ గణనీయంగా మారాయన్నది ఈనాడు ఉవాచ కావొచ్చుగాక.!

రాజకీయాల్లో రెండు ప్లస్సులు కలిస్తే, మైనస్ కూడా అవ్వొచ్చు. ఐదు ప్లస్ ఐదు ఒక్కోసారి పది అవ్వొచ్చు, పదిహేను కూడా అవ్వొచ్చు.. లేదంటే, మైనస్ అయిదు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. అదే రాజకీయమంటే.!

టీడీపీ – జనసేన కలిస్తే, రెండు పార్టీల ఓటింగ్ పెరుగుతుందన్నది ఓ అంచనా. లేదూ, ఈ పొత్తు అస్సలేమాత్రం ఆ రెండు పార్టీల సానుభూతిపరులకీ నచ్చకపోతే, వ్యవహారం వేరేలా వుంటుంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్ని విశ్లేషిస్తున్న ‘ఈనాడు’ ఈ లాజిక్కుని ఎందుకు మిస్సయ్యిందో.!

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి తిరుగు లేదు.! మెజార్టీ తగ్గుతుందేమోగానీ, వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందన్న భావన అన్ని సర్వేల ఫలితాల్లోనూ కనిపిస్తోంది. అలాంటప్పుడు, వైసీపీని అంత తేలిగ్గా ఎలా తీసిపారెయ్యగలం.?

పైగా, పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకరన్నట్టుగా టీడీపీ అను‘కుల’ మీడియా కథనాల్ని వండి వడ్డించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.