మీడియా మీద సెటైర్లెందుకు లోకేషూ.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించారు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్. తండ్రి పరిస్థితిని చూసి నారా లోకేష్ చలించిపోయారు. చంద్రబాబు భద్రతపై అనుమానాలున్నాయంటూ లోకేష్ సహా టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ని వెంటేసుకుని, చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు నారా లోకేష్. మరోమారు లోకేష్‌తో భేటీ అయ్యాక తెలంగాణలో పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థుల లిస్టుని ఖరారు చేస్తామని కాసాని చెబుతున్నారు.

మరోపక్క, మీడియాపై గుస్సా అయ్యారు నారా లోకేష్, తన తండ్రితో ములాఖత్ అనంతరం. సాక్షి మీద సెటైర్లు.. దాంతోపాటుగా ఎన్టీవీ, టీవీ9 మీదా సెటైర్లతో లోకేష్ హడావిడి చేసిన వైనం, మీడియా ప్రతినిథులకు చికాకు తెప్పించింది.

తెలుగునాట మీడియా, పార్టీల వారీగా విడిపోయిందన్నది బహిరంగ రహస్యం. టీడీపీ అనుకూల మీడియాని వైసీపీ, వైసీపీ అనుకూల మీడియాని టీడీపీ బహిష్కరించడం తెలిసిన విషయమే. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతిలపై వైసీపీ నేతలు విరుచుకుపడతారు. సాక్షి, టీవీ9, ఎన్టీవీ మీద టీడీపీ మండిపడటం చూస్తూనే వున్నాం.

అయినా, మీడియాని ఇలా తయారు చేయడంలో టీడీపీ పాత్రే ఎక్కువ. రాష్ట్రంలో మీడియాని తమ రాజకీయ అవసరాల కోసం వాడేయడం మొదలు పెట్టిన టీడీపీ, ఆ అనుకూల మీడియా దెబ్బకే బలైపోయింది 2019 ఎన్నికల్లో. అయినా, టీడీపీ బుద్ధి మారడంలేదు.

‘నా తండ్రి ఎలాంటి తప్పూ చేయలేదు’ అని నారా లోకేష్ పదే పదే చెబుతున్నారు. తప్పు చేశారా.? లేదా.? అన్నది కోర్టులు తేల్చుతాయి. అసలంటూ న్యాయస్థానాల్లో సరైన వాదనలు వినిపించి, బెయిల్ కూడా తెచ్చుకోలేకపోతున్న చేతకానితనం గురించి లోకేష్ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.