శంఖంలో పోస్తే తీర్ధం అవుతుందన్నట్లు… ఏదైనా విషయం కాస్త అతి అయినప్పటికీ. అసత్యం అయినప్పటికీ, నిజమే అయినప్పటికీ… అది తాము చెప్పితేనే కరెక్ట్ అని భావిస్తుంటుంది రామోజీ ఈనాడు పత్రిక అని అంటుంటారు! ఆ కామెంట్లకు తగ్గట్లుగానే వారి ప్రవర్తన ఉంటుంటుంది. ఈ క్రమంలో తాజాగా చిరుతలనుంచి రక్షించుకోవడం ఎలా అనే కథనం అచ్చేసింది ఈనాడు!
అవును… రామోజీరావు నేతృత్వంలో నడిచే ‘ఈనాడు’ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోన్న నేపథ్యంలో… చిరుతల దాడి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో ఈనాడు పత్రికలో కథనం రాశారు. దీంతో ఆ కథనంలోని అంశాలను పట్టుకుని వాయించి వదులుతున్నారు నెటిజన్లు!
తాజాగా చిరుతల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే కథనం అచ్చేసిన ఈనాడు… “చిరుత పులి ఎదురు పడితే రెండు చేతులు పైకి లేపి గట్టిగా అరవాలి” అని రాసుకొచ్చింది. దాంతో… తనకంటే ఎక్కువ ఎత్తు ఉన్న జంతువు ఉందన్న భ్రమలో పక్కకు తప్పుకునే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చింది.
అనంతరం… అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తనకంటే పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా అవి దాడికి దిగవు కాబట్టి… తనకంటే పెద్ద జంతువు అనే అభిప్రాయం చిరుతలో కల్పించడం కోసం అలా చేతులు పైకెత్తాలని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో… చిరుత ఎదురు పడితే భయంతో పరుగెత్తొద్దని తెలిపింది. దీంతో వాయించి వదులుతున్నారు నెటిజన్లు.
ఇటీవల తిరుమల నడక మార్గంలో వరుస చిరుత దాడులు భక్తుల్ని ఆందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందిస్తూ.. నడక దారిలో వెళ్లే భక్తులకు ప్రత ఒక్కరికీ పొడవాటి కర్ర ఇస్తామని, అది వారికి కొద్దోగొప్పో ధైర్యాన్ని ఇస్తుందని చెప్పారు.
అయితే ఆ విషయాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నారు విపక్ష సభ్యులు.. వారి అనుకూల మీడియా! దీంతో… టీటీడీ చైర్మన్ పై ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఈనాడులో రాసిన కథనానికీ… ఇటీవల కరుణాకరరెడ్డి చెప్పిన అంశానికి తేడా ఏముందనేది ప్రశ్న. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తనకంటే పెద్దగా ఉన్న జంతువులపై చిరుతలు దాడికి దిగవంటూ రాశారు. భక్తుల చేతికి కర్ర ఇవ్వడంలోని తమ ఉద్దేశ్యం కూడా ఇదే అని ముందే చెప్పారు భూమన.
అయితే నాడు కరుణాకర్ రెడ్డి… కర్ర పుచ్చుకుని నడిస్తే ధైర్యంగా ఉండటంతోపాటు, ఆ కర్ర నిలబెట్టి పట్టుకుంటే చిరుత భయపడుతుందని తెలిపారు. దాన్ని వెటకరించిన తమ్ముళ్లు… ఇప్పుడు కర్ర కాదు జస్ట్ చేతులు పైకెత్తి అరిస్తే చాలు అని రామోజీ రావు అచ్చేసిన కథనంపై ఏమంటారనేది ఆసక్తిగా మారింది. దీంతో… ఆన్ లైన్ వేదికగా సెటైర్లు పడుతున్నాయి!