తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్ ఇక కూడికలు, తీసివేతల మీద దృష్టి సారించింది. 88 స్థానాలతో గెలిచిన వెనువెంటనే ఇద్దరు ఇండిపెండెంట్లను తనలో ఇముడ్చుకుని 90కి చేరింది ఆ పార్టీ. అసెంబ్లీలో సభ్యుల ప్రమాణస్వీకారం నాటికి తన సంఖ్య వంద దాటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూడికల పని ఒకవైపు నడుస్తుండగా తీసివేతల పని కూడా మరోవైపు సమాంతరంగా సాగిస్తున్నారు గులాబీ నేతలు. కూడికలు అంటే చేరికలు సరే, మరి తీసివేతల ముచ్చటేందో చదవండి.
ముందస్తు ఎన్నికలకు ముందు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు గోడ దూకారు. వారిలో కొందరు గతంలో కాంగ్రెస్ నుంచే టిఆర్ఎస్ కు వచ్చినవారున్నారు. కొందరు టిఆర్ఎస్ ద్వారానే ఎమ్మెల్సీ అయినవారు ఉన్నారు. ఇప్పుడు వారి మెడకు అనర్హత కత్తి వేలాడుతున్నది. ఆ అనర్హత కత్తి వేలాడదీసింది టిఆర్ఎస్ పార్టీనే. పార్టీ ఫిరాయించిన నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టిఆర్ఎస్ శాసనమండలి నేతలు పాతూరు సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేశారు. తక్షణమే వారి మీద వేటు వేయాలని వారు లేఖలో కోరారు.
ఆ నలుగురు ఎవరంటే ?
1 రాములు నాయక్
2 యాదవ రెడ్డి
3 భూపతి రెడ్డి
4 కొండా మురళి
వీరంతా ఎన్నికల ముందు రకరకాల కారణాల వల్ల టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రాములు నాయక్ నారాయణ్ ఖేడ్ టికెట్ ఆశించారు. తనకు టికెట్ ఇవ్వాలని కేసిఆర్ ను కోరారు. కానీ కేసిఆర్ టికెట్ నిరాకరించడంతో రాములు నాయక్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాములు నాయక్ హైదరాబాద్ లోని ఒక హోటల్ లో కాంగ్రెస్ ప్రముఖులతో భేటీ అయిన సమాచారం తెలిసిన వెంటనే రాములు నాయక్ ను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.
ఇక కొండా మురళి కథ కూడా ఇలాంటిదే. కొండా మురళి, కొండా సురేఖ ముందస్తు ఎన్నికల ముందు టిఆర్ఎస్ ను వీడారు. కొండా సురేఖ కు పరకాలలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కానీ ఘోర పరాజయం చవిచూశారు. అయితే కొండా మురళి ఎమ్మెల్సీగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. దీంతో ఆయన మీద అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ కోరింది.
మరో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఎమ్మెల్సీ పదవి ఉండగానే టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరుపున నిజామాబాద్ రూరల్ లో పోటీ చేశారు. కానీ అక్కడ బాజిరెడ్డి గోవర్దన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల ముందే భూపతిరెడ్డి గోడ దూకబోతున్నట్లు టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నాయకత్వం పసిగట్టింది. వెంటనే సిఎం కేసిఆర్ కు ఫిర్యాదు చేసింది. భూపతిరెడ్డి పూర్తిగా రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కనుసన్నల్లో నడిచినట్లు చెబుతున్నారు. అయితే సిఎం భూపతిరెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్ లో ఉంచారు. ఇప్పుడు అదును చూసి వేటుకు సిఫార్సు చేసింది టిఆర్ఎస్.
ఇక యాదవ రెడ్డి పరిస్థితి మరింత విచిత్రం. ఆయన తొలుత కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే టిఆర్ఎస్ లో చేరిన యాదవ రెడ్డికి టిఆర్ఎస్ మళ్లీ ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది. అయితే జిల్లా రాజకీయాల్లో యాదవ రెడ్డికి మంత్రి మహేందర్ రెడ్డికి మధ్య విబేధాల కారణంగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. చేవెళ్ళ (రాజీనామా చేసిన) ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి అనుచరుడిగా యాదవరెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే యాదవ రెడ్డి బయటకొచ్చిన తర్వాత ఎన్నికల ముందు విశ్వేశ్వర్ రెడ్డి సయితం పార్టీ వీడారు. ఇప్పుడు యాదవ రెడ్డిపై వేటుకు టిఆర్ఎస్ సిఫార్సు చేసింది.