తెలంగాణలో బలమైన పార్టీ తెరాస, ప్రస్తుతం అధికారంలో వున్నా ఆ పార్టీలో మెల్ల మెల్లగా వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. అధినేతకు భయపడి కొందరు నేతలు మౌనంగా వున్నా కానీ మరికొందరు మాత్రం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అందులో ముందు వరసలో ఉన్నాడు మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కోందండరాం తో కలిసి స్వామి గౌడ్ ఉద్యోగులను ఏకం చేసి, సకలజనుల సమ్మెను విజయవంతం చేసాడు.
ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం తెరాస అధికారంలోకి రావటం జరిగింది. దీనితో స్వామి గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెరాస లో చేరాడు. ప్రత్యేక ఎన్నికల్లో పోటీచేయాలని అనుకున్నాడు, కానీ ఉద్యోగుల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేసాడు కేసీఆర్. ఆ తర్వాత మండలి చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది. దీనితో స్వామి గౌడ్ చేసేది ఏమి లేక సైలెంట్ అయ్యాడు. 2018 ఎన్నికల సమయంలో రాజేంద్ర నగర్ నుండి పోటీచేయాలని అనుకున్నాడు, కానీ తెరాస అధినాయకత్వం నుండి ఎలాంటి సానుకూలత కనిపించకపోవటంతో ఆగిపోయాడు. ఆ తర్వాత చేవెళ్ల పార్లమెంట్ నుండి ఎంపీ గా పోటీచేయాలని భావించి కేసీఆర్ ని కలవటానికి ట్రై చేసాడు, కానీ కేసీఆర్ అనుమతి లభించకపోవటంతో కేటీఆర్ ని కలిసి తన మనస్సులోని ఆలోచనను పంచుకున్నాడు, కానీ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం తెరాస పార్టీ స్వామి గౌడ్ కి ఇవ్వలేదు. దీనితో అప్పటినుండి పార్టీకి కొంచెం దూరంగా వుంటూ వస్తున్నాడు. ఈ మధ్య తెరాస పార్టీ మీదే ఆరోపణలు చేస్తూ మీడియాలో నిలుస్తున్నాడు.
తెరాస పార్టీలో ఉంటే తనకి రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన స్వామి గౌడ్ ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తుంది. ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ అధికారం అనేది కొన్ని కులాలవాళ్లే అనుభవిస్తున్నారంటూ బీసీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేసాడు. మరో సమావేశంలో సీఎం కేసీఆర్ కి బద్ద శత్రువైన రేవంత్ రెడ్డిని పొగిడి, తెరాసకి మంట పుట్టించే పని చేసాడు, గతంలో ఈటెల రాజేందర్ లాంటి నేతలు కూడా తెరాస పార్టీ మీద విమర్శలు చేయటం చూసాం, ఆ తర్వాత ఏవో బుజ్జగింపులు లాంటివి జరిగి అయన సైలెంట్ అయ్యాడు. బహుశా తనను కూడా అలాగే బుజ్జగిస్తారనుకొని స్వామి గౌడ్ తెరాస మీద ఆరోపణలు చేసి ఉండవచ్చు, లేదా తాను వెళ్లకుండా పార్టీ వాళ్లే తనను బయటకు పంపిస్తే సానుభూతి వస్తుందని భావించి కూడా ఇలా ఆరోపణలు చేసి ఉండవచ్చు. ఏదిఏమైనా కానీ స్వామి గౌడ్ కేసీఆర్ మీద ఆగ్రహంగా ఉండటానికి కారణం, అయన అనుకున్న స్థానం తెరాస లో దక్కకపోవటమే అని తెలుస్తుంది.