తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలినవి లోకల్ బాడీస్ ఎన్నికలు. అలాగే పార్లమెంటు ఎన్నికలు. కానీ మధ్యలో ఇంకో ఎన్నికలు టిఆర్ఎస్ కు చిరాకు తెప్పిస్తున్నాయి. అందుకే ఆ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షం లేకుండా చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. ఆ ఎన్నికలు ఏవో కాదు శాసనమండలి ఎన్నికలు. శాసనమండలిలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసింది టిఆర్ఎస్. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు ఒక్క పిటిషన్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ చిత్తై పోయింది. టిఆర్ఎస్ కు అనుకూలంగా మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఈ పరిస్థితుల్లో శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను ఇరకాటంలోకి నెట్టేలా రాములు నాయక్ కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఆ వివరాలేంటో చదవండి.
శాసనమండలిలో టిఆర్ఎస్ రెబెల్ గా ఉన్న నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేసింది ఆ పార్టీ. అందులో ఒకరైన కొండ మురళి తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా కూడా ఆమోదం పొందింది. ఇక ముగ్గురు ఎమ్మెల్సీలు మిగిలిపోయారు. వారిలో యాదవరెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు. వారిపై రేపో మాపో అనర్హత వేటు పడే చాన్సెస్ ఉన్నాయి. కానీ రాములు నాయక్ అనే ఎమ్మెల్సీ మాత్రం టిఆర్ఎస్ పార్టీకి, శాసనమండలి ఛైర్మన్ కు సవాల్ విసురుతున్నారు.
సోమవారం శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కలిశారు ఎమ్మెల్సీ రాములు నాయక్. ఈ సందర్భంగా తనకు ఛైర్మన్ ఇచ్చిన నోటీసుకు స్పందనగా ఒక లేఖ అందజేశారు. నోటీసుకు బదులిచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరారు. 4 వారాలు గడువు కోరినట్లు మీడియాకు చెప్పారు రాములు నాయక్. కానీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఛైర్మన్ కు అందజేసిన లేఖలో మాత్రం షాకింగ్ విషయాలను వెల్లడించారు రాములు నాయక్.
రాములు నాయక్ రాసిన లేఖలో ఏముందంటే? ‘‘నాలాగే ఫరూక్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మీద కూడా అనర్హత వేటు వేయాలని మండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ 2016 జూన్ 23 వ తేదీన మీకు ఫిర్యాదు చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫరూక్ హుస్సేన్ మీద మాత్రం చర్యలు తీసుకోలేదు. కానీ నామీద ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే నోటీసులు జారీ చేశారు. ఆయనకో న్యాయం, నాకో న్యాయమా’’ అని ఛైర్మన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు రాములు నాయక్.
ఫరూక్ హుస్సేన్ ఎపిసోడ్ ను లేవనెత్తడం ద్వారా అధికార టిఆర్ఎస్ పక్షాన్ని, శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను ఇరకాటంలోకి నెట్టారు రాములు నాయక్. తాను ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తిని కానని, గవర్నర్ చేత నామినేట్ చేయబడిన వ్యక్తిని అని గుర్తు చేశారు రాములు నాయక్. అంతేకాకుండా అసలు తనకు ఈనెల 18వ తేదీన ఛైర్మన్ నోటీసులు జారీ చేశారని, కానీ తనను గత నెల 15వ తేదీనే టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అలా చూసుకున్నా తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఛైర్మన్ గుర్తించాలని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేసిన ఘటన భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదని చెప్పారు.
మరి రాములు నాయక్ ఈ లెటర్ కు టిఆర్ఎస్ కానీ, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కానీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.