స్వంత పార్టీ వాళ్లనే చెప్పుతో కొట్టండన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే

టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ నేతల పైనే ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఏమన్నారంటే…

“టిఆర్ఎస్ పార్టీలో దొంగలు మోపయ్యారు. నా మెజార్టీ తగ్గడానికి స్వంత పార్టీలోనే నేతలే కారణం. ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయలు ఇప్పిస్తే అందులో కమీషన్ గా 5 వేలు, 10 వేలు తీసుకుంటున్నారు. కారు ఎక్కించుకొని ఉదయం తీసుకొచ్చి సాయంత్రం తీసుకపోయి దింపుతుర్రు. వారి దగ్గర పైసలు తీసుకొని దావతు చేసుకుంటుర్రు. లబ్ధిదారులేమో తీసుకున్నాయన వల్లనే పైసలు వచ్చినాయి అనుకుంటుర్రు. అసలు ఎమ్మెల్యే ఏం చేయలేదని వారు అనుకుంటుర్రు. దీంతో నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇట్ల చేసే నాకు మెజార్టీ తగ్గేలా చేశారు.

కళ్యాణ లక్ష్మీలో కూడా పైసలు వసూలు చేస్తుర్రు. సబ్సిడిలో ట్రాక్టర్లు ఇప్పిస్తే 50 వేల నుంచి లక్ష రూపాయలు తింటుర్రు. ఇలా అక్కడొక్కడు అక్కడొక్కడు మోపయిండు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. పైసలు ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి వస్తున్నాయి. అవి ప్రజల పైసలు. మధ్యలో ఈ దొంగల పెత్తనమేంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇప్పటి నుంచి నా దగ్గరికి మధ్యవర్తులు రావద్దు. ప్రజలే రావాలి. వాళ్లకు ఆపతేమైనా ఉంటే నాకే చెప్పుకుంటారు. నేను వాళ్లకు సమాధానం చెపుతాను. మధ్యలో వేరేవారు వచ్చేది ఎందుకు. వాళ్ల దగ్గర పైసలు తీసుకునుడెందుకు. 

నేను ప్రజలను తప్పు పట్టడం లేదు. నాయకులను తప్పు పడుతున్నాను. నాయకులు ఎక్కడి వారు అక్కడ చేతులేత్తేసిండ్రు. పని చేయడానికి ఇష్టపడలేదు. నేను గట్లనే చేసిననా వాళ్లకు అక్కరకు వచ్చినప్పుడు పని చేయలేదా. ఇక నుంచి ప్రజలు నా దగ్గరికి నేరుగా రండి. ఎవరికి పైసలు ఇవ్వొద్దు. ఎవరైనా పైసలు డిమాండ్ చేస్తే వారు స్వంత పార్టీ వారైనా సరే చెప్పుతో కొట్టండి. అట్లయితే వారికి బుద్ది వస్తది” అని కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈశ్వర్ వ్యాఖ్యల పై మరి కొందరేమో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వర్ వ్యాఖ్యలతోనైనా చెంచాగిరితో రాజకీయాలు చేసే వారిలో మార్పు వస్తుందని వారు అంటున్నారు. ఏదేమైనా ఈశ్వర్ వ్యాఖ్యలు కొందరికి చెంప పెట్టుడులా ఉన్నాయని నేతలు చర్చించుకున్నారు.