ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం టాప్ …

* సచివాలయం అడుగుతొక్కని ముఖ్యమంత్రి

* జనాలకు అందుబాటులేని ‘జనహిత’ 

ఈ జనహిత భవనంలో ఇంతవరకూ ముఖ్యమంత్రి సందర్శకులను కలిసి వారి సమస్యలు విన్న దాఖలా లేదు.

ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో పూర్తి హంగూ ఆర్భాటాలతో నిర్మించిన ప్రగతిభవన్ ప్రజలకు నిరుపయోగంగా మారింది.    ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవడం, ప్రగతిభవన్‌లో ప్రవేశించడానికి సామాన్యులకు అవకాశం దొరకక పోవడం మీద  మీడియా కంట పడుతూ ఉంది. విమర్శలొస్తున్నాయి.

ముఖ్యమంత్రి సచివాలయం వైపు కన్నెత్తికూడా చూడకపోవడంతో తమ సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కలవాలనుకునే  ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ మధ్య బాగా విమర్శలొస్తున్నాయి.

‘సుమారు పది వేల మంది ప్రజలు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించే విధంగా ప్రగతిభవన్‌ను నిర్మిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే శాసనసభ్యులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్ప సామాన్యులకు ఈ ప్రగతిభవన్‌లో ప్రవేశానికి అనుమతి ఉండటం లేదు.’ అని విజయ క్రాంతి పత్రిక రాసింది.

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతి లేకపోవడం, సచివాలయానికి ముఖ్యమంత్రి రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు,’ అని  విజయక్రాంతి ప్రతినిధి ముట్నూరు రామకృష్ణ  ఈ రోజు ఒక  ప్రత్యేక వార్త రాశారు. ఇది ఆ వార్త విశేషం.

 రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా అంటే, నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం 25 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి సచివాలయాన్ని సందర్శించారు. ఇది భారత దేశంలో ఎక్కడా ఉండదేమో. ఎన్నింటిలోనో నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, ఈ విషయంలో కూడా నెంబర్ వన్ అని చెప్పుకోవాలి. ప్రకటనలిచ్చుకోవాలి. ట్వీట్లు పెట్టాలి.

 చివరి సారి ముఖ్యమంత్రి సచివాలయం ఎపుడొచ్చారో తెలుసా?

 2016 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి వచ్చారు. అదే చివరిసారి  ఈ పత్రిక చెప్పింది.   ప్రగతిభవన్ నిర్మాణం ఎపుడు పూర్తయిందో  అప్పటి నుంచి అధికారిక కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.

సాక్షాత్తూ ప్రభుత్వాధినేతే సచివాలయానికి రాకపోతే, పరిస్థితి ఎలా ఉంటుంది. ఇష్టా రాజ్యమే.

 ‘‘రాష్ట్ర మంత్రుల్లో కనీసం నలుగురైదుగురు మినహా  మిగతావారంతా సచివాలయానికి రావడం అంతంతమాత్రమైంది. దీంతో సమస్యలు పరిష్కారం కోసం వచ్చే సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

‘‘సుమారు 40 కోట్ల రూపాయలతో తొమ్మిది నెలల కాలంలో పూర్తిచేసిన ప్రగతిభవన్‌ను 2016వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆనాటి నుంచి ముఖ్యమైన సమావేశాలకు, సమీక్షలకు ప్రగతిభవన్ వేదికైంది. ఇదే ప్రాంగణంలో ప్రజల సమస్యలు వినడానికి జనహిత పేరుతో మరో భవనాన్ని నిర్మించారు. ఈ జనహిత భవనంలో ఇంతవరకూ ముఖ్యమంత్రి సందర్శకులను కలిసి వారి సమస్యలు విన్న దాఖలా లేదని తెలిసింది.’’

అయతే, ఇక్కడొక తమషా జరుగుతూ ఉంది. జనహితలోసమావేశాలు జరగలేదనడానికి వల్లేదు. జరుగుతున్నాయి. అవేమిటంటే…

ఈ హాల్లో సుమారు పది సమావేశాలు జరిగితే వచ్చిన వాళ్లెవరో తెలుసా?

 వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయతీలకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలను చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో వచ్చిన ప్రజలే. వారెవరంటే…

*రాష్ట్రంలో గొల్లకురుమలకు గొర్రెల పథకం ప్రకటించినందుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో గొల్లకురుమల సంఘం.

*ఎస్‌సి, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకటించినందుకు ఎస్‌సి,ఎస్‌టి శాసనసభ్యుల ఆధ్వర్యంలో దళితులు

*గిరిజనసంఘాలకు చెందినవారు,

*గౌడ కులస్థులకు రాయితీలు ప్రకటించినందుకు శాసనసభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ నాయకత్వంలో గౌడ కుల సంఘాల ప్రతినిధులు

*ముఖ్యమంత్రి థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన మరునాడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, నగరానికి చెందిన ఇతర శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడకొచ్చి ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రగతి భవన్ దగ్గిర ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ (pic Telangana Today)

అంతేతప్ప ఇంతవరకు ప్రగతిభవన్‌లో ఒక్క అఖిలపక్ష సమావేశంకానీ, వివిధ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలను సమర్పించడానికి ఇతర రాజకీయ పార్టీ నాయకులు ప్రగతిభవన్‌కు వచ్చిన దాఖలాలు లేవని విజయ క్రాంతి పేర్కొంది.

ఇవి కాకుండా జరిగిన ముఖ్యమయిన సమావేశాలేంటే…

*సమాచార చట్ట సమావేశం కోసం ప్రతిపక్ష నాయకుని హోదాలో కె.జానారెడ్డి ఒకసారి ప్రగతిభవన్‌కు రావడం

*హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలలో జరిగిన పార్టీ జాతీయ మహాసభలకు ప్రభుత్వపరంగా సహాయం కోరడానికి సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రగతిభవన్‌కొచ్చారు.

  సుమారు 300 కార్లు పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా అత్యంత విశాలంగా ప్రగతి భవన్‌ను నిర్మిస్తున్నామని అన్ని అధికారిక సమావేశాలు, జిల్లా కలెక్టర్ల సమావేశాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. అయితే ప్రగతిభవన్ నిర్మాణం జరిగిన తర్వాత కూడా రెండుసార్లు జిల్లా కలెక్టర్ల సమావేశం నగరంలో ఒక ప్రముఖ హోటల్‌లో జరగడం విశేషమని విజయ క్రాంతి పేర్కొంది.

సందడి లేని సచివాలయం

నగరం నడిబొడ్డులో ఉన్న సచివాలయంలోని సి బ్లాక్‌లో ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన కార్యాలయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని చాలామంది ముఖ్యమంత్రులు ఇక్కడినుంచే పరిపాలన సాగించేవారు. ముఖ్యమంత్రి, వారంలో ఒకరోజు సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి గంటసేపు సమయం కేటాయించేవారు. ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తుండటంతో మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు సమయానికి సచివాలయానికి క్రమంతప్పకుండా వచ్చి తమ శాఖల సమీక్షలు నిర్వహించేవారు. ఇపుడా పరిస్థితి లేదంటున్న విజయక్రాంతి

*రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టి.రామారావు తన శాఖలకు చెందిన అధికారులతో సమావేశాలను మెట్రోరైల్ భవన్‌లోనూ, ప్రగతిభవన్‌లోనూ నిర్వహిస్తున్నారు.

*రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు జలసౌధలోని కార్యాలయం నుంచి నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌శాఖల పనితీరును సమీక్షిస్తున్నారు.  ఇరిగేషన్‌శాఖకు చెందిన  సమస్యలపై ఇతర జిల్లాల మంత్రులు కూడా హరీష్‌రావు నిర్వహించే సమావేశాలకు జలసౌధకే హాజరవుతున్నారు.

*రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎర్రమంజిల్ కాలనీలోని ఇఎన్‌సి కార్యాలయం నుంచి,

*దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొన్ని సమావేశాలను బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషన్ కార్యాలయం నుంచి నిర్వహిస్తున్నారు.

*రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి మహమూద్ అలి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణం, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి, రహదారుల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల పర్యటనలు లేకపోతే సచివాలయానికి వస్తుంటారు.

నియంత పాలన

నిజాం నాటి పాలనలో కూడా గోల్కొండ కోటలోనికి ప్రజలు వెళ్లి సమస్యలు చెప్పుకోవడానికి వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ నయా గోల్కొండ రాజదర్బార్‌లోకి ప్రవేశం లేకుండా ముఖ్యమంత్రి నియంతలా పాలనను సాగిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఎన్నుకుంటే సచివాలయానికి రాకుండా ఇంట్లో కూర్చుని పరిపాలనను సాగించడం కేసీఆర్‌కే చెల్లిందని, ఇది రాష్ట్ర దౌర్భాగ్యమని ఆయన అన్నారు.