రోజు రోజుకీ దిగజారిపోతున్న బీజేపీ… సెక్రటేరియట్ పై కూడానా?

మతతత్వ పార్టీగా ముద్రపడినా.. రకరకాల కారణాలతో రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కథనాలొస్తున్న తరుణంలో… ప్రస్తుతం కర్నాటక ఎన్నికల్లో పోటీపడుతుంది. ఆ సంగతులు అలా ఉంటే… తెలంగాణ రాష్ట్రంలో జెండా పాతాలని పరితపించిపోతున్న బీజేపీ… అందుకు ఎంచుకున్న మార్గం, చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సాధారణ పౌరులకు చికాకు తెప్పిస్తున్నాయి.

తెలంగాణలో అధికారంలోకి వస్తే… ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై.. కేంద్ర హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ స్థాయికి దిగజారి వ్యాఖ్యానించారంటూ విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇదే సమయంలో… కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకలహాలు, అల్లర్లు జరుగుతాయంటూ బెదిరింపు వ్యాఖ్యలకు దిగారు! కేవలం మత రాజకీయాలనే నమ్ముకుని ముందుకు సాగుతున్న బీజేపీ నేతలు.. ఈ సమయంలో తెలంగాణ కొత్త సచివాలయంపై కూడా కామెంట్స్ చేశారు.

అవును… తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ పై బీజేపీ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో… పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన‌ ట్వీట్ వారి దిగజారుడు స్వభావాన్ని తెలియజేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. “కొత్త రాష్ట్ర సచివాలయ భవనం మసీదును పోలి ఉంది, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, వైభవం.. ఈ నిర్మాణంలో ప్రతిబింబించలేదు. హిందూ సమాజం భావోద్వేగాలు భవనంలో ప్రతిబింబించలేదు. సచివాలయం కేవలం ఎంఐఎం పార్టీని సంతోషపెట్టడానికి మాత్రమే” అని ఆరోపించింది. దీంతో బీజేపీ నేతలను ఆన్ లైన్ వేదికగా వాయించేస్తున్నారు నెటిజన్లు.

సుప్రీంకోర్టు, మైసూర్ ప్యాలెస్, గుజరాత్ అసెంబ్లీ భవనం వంటి దేశంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో డూంలు అంతర్భాగమని పలువురు నెటిజనులు బీజేపీకి చురకలు అంటిస్తున్నారు. కర్ణాటకతో సహా బిజెపి పాలిత రాష్ట్రాల సెక్రటేరియట్, అసెంబ్లీ చిత్రాలను ఈ సందర్భంగా రీట్వీట్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు వాటి నిర్మాణం కూడా అలాగే ఉందని ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి చర్యలోనూ మతపరమైన కోణాలను తవ్వే ప్రయత్నం చేయకుండా, దానిని ఒక గొప్ప నిర్మాణంగా ఎందుకు చూడకూడదని పలువురు నెటిజనులు బీజేపీని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్… తాజ్ మహల్ చిత్రాన్ని బహూకరిస్తున్న ఫోటోను కూడా ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా… హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని నెటిజనులు బీజేపీని ఆన్ లైన్ వేదికగా కోరారు. “మేము హైదరాబాద్‌ లో చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాము.. దానిని పాడుచేయకండి” అని బీజేపీ ట్వీట్‌ కు ట్విట్టర్ యూజర్స్ బదులిస్తున్నారు.