తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నూతన సచివాలయాన్ని నిర్మించింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుని కూడా పెట్టారు ఈ కొత్త సచివాలయానికి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సేవలందించిన సెక్రెటేరియట్, ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. విడి విడిగా రెండు సెక్రెటేరియట్లుగా మారి కూడా కొన్నాళ్ళపాటు సేవలందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటయ్యాక, ఆ అమరావతిలో సచివాలయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించడంతో, హైద్రాబాద్ నుంచి ఏపీ సెక్రెటేరియట్ అమరావతికి తరలి వెళ్ళింది.
అమరావతిలో సచివాలయం అంటే.. దాంట్లోనే, అసెంబ్లీ అలాగే శాసన మండలి భవనం కూడా వున్నాయి. కానీ, అదంతా ‘తాత్కాలికం’ పేరుతో నిర్మించింది అప్పటి చంద్రబాబు సర్కారు. ఆ తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదు గడచిన నాలుగేళ్ళుగా.
ఇక, తెలంగాణ సెక్రెటేరియట్ విషయానికొస్తే, జ్యోతిష్యం అలాగే వాస్తుని బాగా నమ్మే కేసీయార్, వాస్తు దోషాలున్నాయన్న కారణంగా పాత సెక్రెటేరియట్ మొహం కూడా చూడలేదెప్పుడూ. ఈ నేపథ్యంలోనే ఆ సెక్రేటేరియట్‌ని కూల్చేసి, కొత్త భవన సముదాయాన్ని నిర్మించ తలపెట్టారు, పూర్తి చేసేశారు కూడా.
ఖచ్చు విషయానికొస్తే, సుమారు ఆరు వందల కోట్ల రూపాయల వరకు వెచ్చించారట. అదే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో తాత్కాలిక సచివాలయానికి అటూ ఇటూగా వెయ్యి కోట్లపైనే ఖర్చయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అమరావతి పరిస్థితి వేరు, హైద్రాబాద్ వ్యవహారం వేరు.