టిఆర్ఎస్ గూటికి చేరనున్న మరో ఎమ్మెల్యే

టిఆర్ఎస్ గూటికి టిడిపి సీనియర్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలోనే సండ్ర వెంకట వీరయ్య టిఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చినా వాటినిన ఆయన ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యేగా సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో సండ్ర గంట పాటు ఏకాంత చర్చలు జరిపారు.

సండ్ర వెంకట వీరయ్య టిడిపి అభ్యర్దిగా మహాకూటమి మద్దతుతో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచినప్పటి నుంచే టిఆర్ఎస్ కీలక నేతలకు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. జనవరి 17న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఎమ్మెల్యేలుగా అంతా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ రోజు సండ్ర హాజరు కాలేదు. సండ్ర టిఆర్ ఎస్ లో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో టిఆర్ ఎస్ లో చేరిన తర్వాత ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో సండ్ర జనవరి 17 న ప్రమాణ స్వీకారం చేయనట్టుగా తెలుస్తోంది. కానీ ఆదివారం అనూహ్యంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకార చేసిన వెంటనే గంటపాటు కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఎప్పుడైనా అసెంబ్లీకి తొలి సారి వచ్చే క్రమంలో సండ్ర పసుపు రంగు చొక్కా ధరించి వస్తారు. కానీ ఈ సారి తెల్లరంగు చొక్కా వేసుకొని వచ్చారు. కేసీఆర్ తో భేటికి సంబంధించి సండ్ర కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మర్యాదపూర్వకంగానే సీఎం కేసీఆర్ ను కలిశానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారని గుర్తు చేశారు. ఒక వేళ తాను పార్టీ మారితే ప్రజలకు చెప్పే మారుతానన్నారు. అయినా ప్రగతి భవన్ కు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ మారడం, మారకపోవడం ముఖ్యం కాదని ప్రజలల్లో ఉంటే గెలుస్తామన్నారు.  

సండ్ర వెంకట వీరయ్య

సండ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయమని స్పష్టమవుతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కూడా వ్యూహత్మకంగానే మంత్రి మండలి విస్తరించకుండా పెండింగ్ లో పెట్టారన్న వాదన వినిపిస్తోంది. కొంత మంది సీనియర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్,టిడిపి నుంచి చేర్చుకొని ఆ తర్వాతే మంత్రి మండలి విస్తరిస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో సండ్ర వెంకట వీరయ్యకు కూడా కేబినేట్ పోస్టు పై హామీ లభించిందని ఆయన చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది.