ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. మంగళవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అధికార పార్టీ మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 5 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్‌ తరఫున గూడూరు నారయణ రెడ్డిని బరిలోకి దింపింది.

ఆ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.  ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

 ‘కూటమిగా పోటీచేసిన మాకు 19 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఒక ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంది. అందుకే మేము ఒక అభ్యర్థిని నిలబెట్టాం. కానీ సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులతో మా ఎమ్మెల్యేలను లాక్కొంటున్నారు. సీఎం వైఖరికి నిరసనగా.. ఈ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం. ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయించాలి. మత రాజకీయాలు చేస్తున్న మోదీ కావాలా? త్యాగాలు చేసే రాహుల్‌ గాంధీ కావాలా?  16 ఎంపీలను గెలిపించాలంటున్న టీఆర్‌ఎస్‌ గత 5 ఏళ్లలో  ఏం చేసింది. ఒక్క నంది ఎల్లయ్య మినహా మిగతా ఎంపీలంతా టీఆర్‌ఎస్‌, వారి మిత్రపక్షాలే కదా. 16 మంది ఎంపీలు ఉండి కూడా విభజన హామీలు సాధంచలేదు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డిలు టిఆర్ఎస్ బాటలో నడుస్తామని సంకేతాలు అందించారు. దీంతో కాంగ్రెస్ చేసేదేం లేక ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది.