బ్రిటీష్ వాళ్లు భారతదేశంలో అమలు చేసిన సూత్రం… “విభజించు పాలించు” అని! ఆ సంగతి అలా ఉంటే… ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసమే ఆలోచిస్తుంది.. వారిని ఉద్దరించాలని చూస్తుంది.. అందువల్ల హిందువులెవరూ ఆ పార్టీకి ఓటు వేయకండనే స్థాయి ఎన్నికల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో… నేతలు దేశాన్ని ఏమి చేద్దామని భావిస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారనే చర్చ మొదలైంది!
తాజాగా మధ్యప్రదేశ్ లోని ధార్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగంలో ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇందులో భాగంగా… “మోడీకి 400 సీట్లు ఇవ్వండి.. లేదంటే కాంగ్రెస్, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తుంది!” అని దేశ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తనకు 400 సీట్లు ఎందుకో తెలుసుకోవడం దేశానికి అవసరం అని చెప్పిన మోడీ.. తీవ్ర స్థాయిలో విద్వేష ప్రసంగం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టారనే విమర్శలను సొంతం చేసుకున్నారు!
ఈ క్రమంలో… తనకు 400 సీట్లు ఇస్తేనే.. కాంగ్రెస్ చేసే అన్ని కుట్రలను తాను ఆపగలనని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అలాకాకుండా ఎన్డీయే కి మెజార్టీ రాకపోతే.. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వం “ఆర్టికల్ 370″ని తిరిగి తీసుకొస్తుందని హెచ్చరించారు. ఇదే క్రమంలో… ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందని, వాటిని తన ఓటు బ్యాంకుకి బదిలీ చేస్తుందని అన్నారు.
ఇదే క్రమంలో… తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామని ఇప్పటికే అంటున్నారు బీజేపీ నేతలు. దేశ సంపదనంతా ముస్లింలకు దోచిపెట్టేలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని అర్థం వచ్చేలా ఇటీవల మోడీ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా కూడా ఆయన వెనక్కు తగ్గలేదు! ఆ తర్వాత రాహుల్ ని ప్రధానిని చేయాలని పాకిస్తాన్ కోరుకుంటుందని కూడా మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం అంటూ మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టారు!
దీంతో… సాక్షాత్తూ దేశ ప్రధాని కూడా తన స్థాయిని దిగజార్చుకుని అన్నట్లు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో… అయోధ్య రాముడిని ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందన్న విమర్శ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామ మందిరానికి బాబ్రీ తాళం అంటూ మరింత విద్వేషాన్ని కుమ్మరించడం చూస్తుంటే… పూర్తిగా మతం రంగు పులిమిన రాజకీయాలకే మోడీ పెద్ద పీట వేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!