ఏపీ ప్రజలను మోసం చేయడానికి బీజేపీ మరోసారి రెడీ అయిపోయింది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఇద్దరి అంగీకారంతోనే బీజేపీ ఇందుకు మరోసారి సిద్ధమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అలా అని ఇవి కేవలం రాజకీయ విమర్శలు, ఆరోపణలు మాత్రమే అని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అందుకు గల బలమైన కారణాలు ఇప్పుడు చూద్దాం…!
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, అధికారంలోకి రావాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఫిక్స్ అయ్యారు! ఈ సమయంలో వారికి వారి బలం కంటే.. ఏపీలో పెద్దగా బలంలేని బీజేపీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు! హస్తినలో కుస్తీలు పడీ పడీ బీజేపీతో పొత్తు ఓకే చేయించుకున్న పరిస్థితి అనే చర్చ బలంగా నడిచింది. దీనివల్ల కూటమికి ఏదో కలిసొచ్చేస్తుందని భావించి ఉండొచ్చు.
కానీ ప్రజలకు ఒక్కో విషయంపై క్లారిటీ వస్తుండటంతో బీజేపీ కూటమిని ముంచుతుంటే.. కూటమి ఏపీని ముంచబోతుందని అంటున్నారు.
ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను రద్దు!:
ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. బీజేపీ తన మేనిపెస్టోలోనే పెట్టింది. అయితే ఈ విషయంపై తనకు పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ, దాన్ని అడ్డుకునే శక్తి తనకు లేనప్పటికీ చంద్రబాబు మాత్రం ప్రజలను ఏ మార్చే పనికి పూనుకున్నారు!
ఇందులో భాగంగా.. తాను రిజర్వేషన్లను కాపాడతానని ఏపీలోని ముస్లింలకు చెబుతున్నారు చంద్రబాబు. 2014 ఇచ్చిన చాలా హామీల్లాగానే ఇది కూడా అని వైసీపీ నేతలు చెబుతున్నారు. పైగా మోడీ రిజర్వేషన్స్ తీస్తామంటే చంద్రబాబు ఏమి చేయగలరు.. నల్ల బెలూన్లు ఎగరేయడం తప్ప అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేది లేదని చెబుతోంది.
ఇక కూటమిలో బీజేపీని చేర్చడం కోసం ఎన్నో చీవాట్లు తిని మరీ కలిపిన పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో మోడీని ప్రశ్నించేటంత సీన్ లేదు! ఇదే సమయంలో ఈ విషయంపై తనను ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని ముస్లిం మైనారిటీలు ఉన్న నియోజవర్గాలకు కూడా వెళ్లడం మానేశారు! అసలు ఆ టాపిక్కే ఎత్తడం లేదు! దీంతో… ప్రజలు ‘జానీ’ సినిమాలోని పాట పాడుకోవాల్సిన పరిస్థితి!
ఉమ్మడి మేనిఫెస్టో:
ఇక ఉమ్మడి మేనిఫెస్టో విషయానికొస్తే… ఆ మేనిఫెస్టో విడుదల చేసిన రోజు బీజేపీ వ్యవహరించిన తీరు న భూతో న భవిష్యతీ అనేలానే ఉంది! ఉమ్మడి మేనిపెస్టోను కనీసం పట్టుకునేందుకు కూడా వారు అంగీకరించలేదు! వాస్తవానికి కూటమిగా ఏర్పడిన పార్టీలు ఎక్కడైనా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు.. ఆ పార్టీలన్నీ దానికి బద్ధులై ఉంటాయనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తాయి.
అయితే… ఏపీలో మాత్రం బీజేపీ ఈ విషయంలో పక్కాగా సైడ్ అయిపోతుంది. ఏపీలో పొత్తు ఉంది కానీ, మేనిఫెస్టో మాత్రం మాది కాదు! అది టీడీపీ – జనసేన మాత్రమే ఇచ్చుకున్నారన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అంటే… రేపు అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోయినా వారిని అడిగే హక్కు చంద్రబాబు – పవన్ తో పాటు కూటమికి ఓటేసిన ఏపీ ప్రజలెవ్వరికీ ఉండదనే భావించాల్సిన పరిష్తితి కల్పించారని అనొచ్చు!
ఇదే క్రమంలో… పోలవరం విషయానికొస్తే రెండేళ్లలో దీనిని పూర్తిచేస్తామని.. అమిత్ షా చెబుతుంటే.. ప్రధాని మోడీ నోటి వెంట మాత్రం ఆ మాటే రావడం లేదు! 2014లో అది జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించినప్పుడు దాన్ని పూర్తి చేయకుండా బీజేపీ, తన చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు పోలవరం రూపంలో ఏపీకి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదనేది కాదనలేని సత్యం!
పోలవరం:
2019 ఎన్నికల సమయంలో… పోలవరంలో చాలా అవినీతి జరిగిందని, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కు ఇది ఏటీఎంగా మారిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మొడీ.. ఇప్పుడు వారిని పక్కనపెట్టుకుని.. వైసీపీని విమర్శిస్తున్న పరిస్థితి! ప్రధాని స్థాయి వ్యక్తి కూడా ఇలా రెండు నాల్కల ధోరణిలో ఉంటే ఇక దేశం ఏమి కావాలి?
ఈ విషయాలన్నీ ఏపీ ఓటర్లు, ప్రజానికం పరిగణలోకి తీసుకోవాలని పరిశీలకులు కోరుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ముస్లిం రిజర్వేషన్స్, రాజ్యాంగంలో మార్పులు ఉండవనే హామీలు ఏమీ ఇవ్వకుండా మేము కలిసాము కాబట్టి తమకు ఓటు వేయమని అడుగుతున్న కూటమి అధికారంలోకి వస్తే… ఏపీ పరిస్థితి ఎవరి ఊహకు వారికి వదిలేయొచ్చనే కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!