సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు రేవంత్ ను అధికారులు విచారించారు. విచారణ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“రాజకీయ కక్ష్యతోనే నా పై వేధింపులు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నా పై తప్పుడు కేసులు పెట్టారు. అసెంబ్లీ సమయంలో ఐటి అధికారులను పంపారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈడీ అధికారులను పంపుతున్నారు. సీఎం కేసీఆర్, మోదీలది ఫెవికాల్ బంధం. మోదీ మోజుపడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్దీ విచారిస్తున్నారు. నా తల తెగిపడ్డా సరే కేసీఆర్ అక్రమాల పై మాట్లాడుతా… కేసీఆర్ కర్మ కాలిన రోజు ఆయన కూడా ఊచలు లెక్కపెట్టడం ఖాయం.  అప్పుడు మోదీ కూడా ఆపలేడు.

ఈ కేసులో ఇప్పటికే చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ పూర్తి అయిన కేసులో ఈడీ ఏం తేల్చుతుంది. ఈ కేసుతో సంబంధం లేని వేం నరేందర్ రెడ్డి కుమారులను విచారణకు పిలిచి వేధిస్తున్నారు. వారికి రాజకీయ సంబంధాలు లేవు. నా కుటుంబ సభ్యుల పై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు.  అధికారంలో ఉన్న వారి కుట్రను ప్రజలు గమనించాలి.

నా పై పోటి చేసిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద రూ.51 లక్షలు దొరికాయి. దాని మీద ఈడీ, సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదు. మోదీ, కేసీఆర్ లపై పోరాడుతున్న వారి పైనే వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నేను రిమార్క్ లేకుండా బయటపడుతాను. అధికారులు వేధింపులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కేసీఆర్ ఏ విధంగా రెండో సారి అధికారంలోకి వచ్చారో అందరికి తెలుసు. త్వరలోనే ఆయన బండారం బయటపడుతుంది.

సీఎం కేసీఆర్ పనికి మాలిన వాళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడు. హరీష్ రావు, తుమ్మల, కడియం శ్రీహరికి మంత్రి పదవులు రావని ముందే చెప్పాను. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటే కేసీఆర్ కు నచ్చదు. వారికంటే తానే గొప్పగా కనిపించాలన్న ధోరణి కేసీఆర్ ది. తన కన్నా తక్కువ ఉండే వారినే తన దగ్గర ఉంచుకుంటాడు.“ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.