మరో టిఆర్ఎస్ ఎంపీ కి క్యాడర్ షాక్ (వీడియో)

టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీకి స్వంత పార్టీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. మక్తల్ నుంచి పోటి చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎంపీ ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్దిని గెలిపించేందుకు సహకరించని ఎంపీ గో బ్యాక్ అంటూ చిట్టెం అనుచరులు ఆందోళన చేశారు. అసలు వివరాలు ఏంటంటే.. 

సోమవారం మక్తల్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఆత్మకూరులో జరిగింది. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ ఎంపీ, టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి కూడా హజరయ్యారు. జితేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. చిట్టెం ఓటమి కోసం ప్రత్యర్దులకు జితేందర్ రెడ్డి సహకరించారని వారు ఆరోపించారు. జితేందర్ రెడ్డికి ఇక్కడకు వచ్చే అర్హత లేదని మర్యాదతో ఇక్కడ నుంచి వెళ్లి పోవాలని వారు ఆందోళన చేశారు. 

ఈ ఘటన పై ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తాను కట్టుబడి ఉంటానని, పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్దులు గెలిచేందుకు తాను కృషి చేశానన్నారు. ఆ తర్వాత పలువురు నేతలు సర్ది చెప్పడంతో గొడవ సద్దు మణిగింది. 

స్వంత పార్టీ నేతల నుంచే ఎంపీకి చేదు అనుభవం కావడంతో టిఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జితేందర్ రెడ్డి మక్తల్ నియోజకవర్గానికి రాలేదని అసలు ప్రచారంలోనే పాల్గొనలేదని కార్యకర్తలు అంటున్నారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలవకూడదని జితేందర్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు.

చిట్టెం గెలవకూడదని టిఆర్ఎస్ అసమ్మతి వాదులు, ప్రత్యర్ధి పార్టీల నేతలతో చేతులు కలిపారన్నారు. ఎంపీీగా ఉన్నా  మక్తల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఏనాడు కూడా ఎంపీ హోదాలో నియోజకవర్గానికి జితేందర్ రెడ్డి కృషి చేయలేదన్నారు. ఎవరెన్ని చేసినా అంతిమ తీర్పులో ప్రజలు న్యాయానికే పట్టం కట్టారన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అండతో అభివృద్ది పరుచుకుంటామన్నారు.  

కొత్తగూడెంలో జరిగిన టిఆర్ఎస్  సమావేశంలో కూడా ఖమ్మం ఎంపీ పొంగులేటి పై కార్యకర్తలు సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో ఓడిపోవడానికి కారణం ఎంపీనేనని ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలందరికి మళ్లీ సీట్లు దక్కుతాయని కేసీఆర్ ప్రకటించారు.  పలువురు ఎంపీల పై వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆ ఎంపీలకు అవకాశం ఇస్తారా లేక మారుస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.  ఆందోళన వీడియో కింద ఉంది చూడండి.