సీఎం కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన సామాన్య ఓటరు

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిబంధనలు పాటించలేదని ఓ ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ సమయంలో ఆయన నిబంధనలు పాటించలేదని, అతని ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడాల గ్రామానికి చెందిన తమ్మాల శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు.

సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలను ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల నిబంధనలు 1961 ప్రకారం దాఖలు చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అదే విధంగా సీఎం కేసీఆర్ పై అనేక కేసులు ఉన్నాయని వాటిన్నింటిని కూడా యధాతథంగా చూపలేదన్నారు. కొన్ని చోట్ల కేసు నమోదైన కేసు స్వభావం తెలియదని పెట్టారన్నారు. ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం సెక్షన్ 125ఏ(3) ని ఉల్లంఘించడమేనన్నారు. ఈ పిటిషన్ లో కేసీఆర్ తో పాటు ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్దులు, ఎన్నికల అధికారులు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు.

గజ్వేల్ లో అక్రమంగా ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇతర పార్టీల ఏజెంట్లను భయపెట్టి పోలింగ్ బూత్ లను ఆక్రమించి ఓట్లు వేయించుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయాన అధికార దుర్వినియోగం చేసి కుల సంఘాల భవనాలకు పాత తేదిలతో భూములు కేటాయించారన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కేసీఆర్ నామినేషన్ ను ఆర్సీ యాక్టులోని సెక్షన్ 36 కింద ముదే తిరస్కరించాల్సిందన్నారు.

తెలంగాణలోని పలువురు టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అక్రమంగా గెలిచారని కాంగ్రెస్ తరపున పోటి చేసిన ఎమ్మెల్యే అభ్యర్దులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సీఎం కేసీఆర్ పై ఓ ఓటరు పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డాడని, అధికార దుర్వినియోగం చేసి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ హాట్ టాపిక్ గామారాయి. కాంగ్రెస్ వారే ఓటరు చేత పిటిషన్ వేయించారని టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.