ఇది ఫైనల్.! విశాఖే ఆంధ్రప్రదేశ్ రాజధాని.!

ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.! చాలాకాలంగా వైసీపీ చెబుతున్న మాటే ఇది.! దేశానికైనా, రాష్ట్రానికైనా ఓ రాజధాని వుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి. పద్ధతి ప్రకారమైతే, రాష్ట్రానికి అమరావతి రాజధాని.

కానీ, అధికార వైసీపీ, ఆ అమరాతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒప్పుకోవడంలేదు. అదే సమయంలో, ఆ అమరావతితోపాటు మరో రెండు రాజధానులు.. వెరసి, రాష్ట్రానికి మూడు రాజధానులంటోంది. అందులోని విశాఖ పట్ల వైసీపీ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది.

ఇదిగో అదిగో.. అంటూ ఇప్పటిదాకా నాన్చుతూ వచ్చినా, త్వరలో విశాఖ నుంచి పాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైపోయారు. రుషి కొండపై ముఖ్యమంత్రి నివాసం సహా క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇతర శాఖల కార్యాలయాకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. అధికారికంగా విశాఖకు, అమరావతి నుంచి ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ కార్యాయాలు తరలి వెళ్ళడమే తరువాయి. ప్రభుత్వం నుంచి కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన జీవో రూపంలో విడుదలైపోయింది.

విశాఖను రాజధానిగా చెప్పడంలేదు.. ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్ కార్యాలయం పెట్టుకుంటారు, అందుకు తగ్గట్టుగా వివిధ శాఖలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా జీవో విడుదల చేశారు. న్యాయపరమైన వివాదాలు రాకుండా, ఇదో ఏర్పాటు అన్నమాట.

ప్రస్తుతం రాజధాని లేదా రాజధానుల వ్యవహారానికి సంబంధించి పలు పిటిషన్లు విచారణ దశలో వున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుల సంగతెలా వున్నా, పరిపాలన అయితే విశాఖకు తరలి వెళ్ళిపోతోంది. సో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా విశాఖే రాజధాని.! ఇది ఫైనల్.