సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజలను రెచ్చగొట్టేందుకు సిద్దమయ్యారని ఆయన అన్నారు. భద్రాచలంలో మాట్లాడిన రాములు నాయక్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“రాబోయే పార్ల మెంటు ఎన్నికల్లో తెలంగాణోడు ప్రధాన మంత్రి కావాలా వద్దా అంటూ రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ రానున్నారు.  అధికార మదంతో కేసీఆర్ విర్రవీగుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తానని అడ్డుకోవడానికి సుప్రీం కోర్టు ఎవరని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు జరిగి 21 రోజులైనా ‘ఇది నా రాజ్యం, నేను చెప్పిందే వేదం’ అనే భావనతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేటికి నిర్వహించలేదు. కేబినేట్ లేదు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది. సీఎం కేసీఆర్ అంతా తానే అన్నట్టుగా విర్రవీగుతున్నాడు. కొత్త సభ్యులతో ఇంత వరకు శాసన సభ సమావేశం ఎందుకు నిర్వహించలేదు. ఇదేమైనా రాజుల పాలననా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.  తెలంగాణలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ మిత్రపక్షాలకు వస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుస్తది. కేసీఆర్ ఈవీఎంలలో మాయ చేసి గెలిచాడు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ బయలుదేరబోతుండు. కానీ ఈ సారి ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన మదం, అహం దిగుతది. తెలంగాణ ప్రజలు ఆలోచన కలిగిన వాళ్లు తప్పకుండా ఆయనకు వాళ్లు బుద్ది చెబుతారు.” అని రాములు నాయక్ అన్నారు.

ఇటీవల టిఆర్ఎస్ నాయకులు మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. అందులో రాములు నాయక్ పేరు కూడా ఉంది. రాములు నాయక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపికయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో నేతలు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అయితే దీని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సీఎం కేసీఆర్ మరోసారి మోసానికి బయలు దేరాడని చేసిన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.