టిఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది. కేసిఆర్ రెండోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయతోపాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం పూర్తయింది. మిగతా బెర్తులు ఎప్పుడు నింపుతారని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ దశలో కూడికలు, తీసివేతలు సెటిల్ అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నలుగురు ఎమ్మెల్సీల పై వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు రాతపూర్వక ఫిర్యాదు చేసింది ఆపార్టీ. ఆ నలుగురికి ఛైర్మన్ స్వామి గౌడ్ నోటీసులు జారీ చేశారు. అయితే అందులో ముగ్గురి పరిస్థితి వేరు కానీ రాములు నాయక్ పరిస్థితి వేరు. ఆయన వ్యవహారం ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఒక్క టిఆర్ఎస్ పార్టీకే కాదు… శాసనమండలి ఛైర్మన్ కు, చివరకు గవర్నర్ కు సైతం గొట్టు పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనబడుతున్నది. రాములు నాయక్ కొరకరాని కొయ్యగా ఎందుకు మారినట్లు? అనుకుంటున్నారా? చదవండి.
ఇక చాలు మోదీని తీసేయండంటున్న బిజెపి నేత… ఎవరా నేత? …చదవండి
రాములు నాయక్ గిరిజన నేత. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఉన్న నాయకుడు. టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు అనేక కారణాల వల్ల వేరే పార్టీల్లోకి వెళ్లారు. కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరికొందరిని కేసిఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టారు. పార్టీ పుట్టినప్పటి నుంచి మొన్నటి ముందస్తు ఎన్నికల వరకు రాములు నాయక్ టిఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే ముందస్తు ఎన్నికల సమయంలో ఆయన టిఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రముఖులను కలిసినట్లు గుర్తించిన టిఆర్ఎస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఛైర్మన్ కు లేఖ రాసి అనర్హత వేటు వేయాలని కోరింది.
రాములు నాయక్ బయట టిఆర్ఎస్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడే కావొచ్చు… కానీ ఆయన శాసనమండలిలో మాత్రం ఏ పార్టీకి చెందిన సభ్యుడు కాదు. ఎందుకంటే ఆయనను ఏ పార్టీ ఎన్నుకోలేదు. ఆయనను శాసనమండలికి నామినేట్ చేసింది గవర్నర్. తెలంగాణ కేబినెట్ సూచన మేరకు గవర్నర్ నామినేట్ చేశారు. అందుకే ఆయనకు ఏ పార్టీ రంగు, రుచి, వాసన అనేవి అధికారింగా మాత్రం ఉండవు అని చెబుతున్నారు. అయితే బయట మాత్రం రాములు నాయక్ టిఆర్ఎస్ నాయకుడిగానే చెలామణి అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ సభ్యుల గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు.
ఈ పరిస్థితుల్లో రాములు నాయక్ అనే శాసనమండలి సభ్యుడిపై అనర్హత వేటు పడుతుందా? లేదా అన్నది చర్చనీయాంశమైంది. రాములు నాయక్ 2014 జూలై 22న శాసనమండలికి ఎన్నికయ్యారు. మరో 18 నెలల పాటు ఆయన సభ్యత్వం కొనసాగనుంది. ఇప్పుడు ఆయన సభ్యత్వం ఎలా రద్దు చేస్తారన్న చర్చ జోరందుకున్నది. టిఆర్ఎస్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ శాసనమండలి ఛైర్మన్ కు చేసిన ఫిర్యాదు మేరకు రాములు నాయక్ కు నోటీసులు జారీ చేశారు ఛైర్మన్ స్వామి గౌడ్.
నా మీద ఫిర్యాదు చేయడమే రాజ్యాంగ విరుద్ధం : రాములు నాయక్
తన మీద టిఆర్ఎస్ ఎల్పీ నుంచి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసిన అంశంపై రాములు నాయక్ స్పందించారు. ఆయన తెలుగు రాజ్యంతో మాట్లాడారు. నా మీద ఫిర్యాదు చేసే హక్కే చీఫ్ విప్, విప్ కు లేదు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యుడి మీద అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ ఫిర్యాదు చేసిన చరిత్ర ఇప్పటి వరకు తెలుగు నేల మీద లేదు. ఇలాంటి ఫిర్యాదును ఎదుర్కొన్న మొదటి వ్యక్తిని నేనే అవుతానేమో. అసలు నా మీద అనర్హత వేటు వేయడం సాధ్యం కానే కాదు.
నా మీద వేటు వేయాలంటే తెలంగాణ కేబినెట్ సూచన మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేయడంలో అర్థం లేదు. నాకు ఛైర్మన్ ఇచ్చిన నోటీసుకు త్వరలోనే జవాబు చెబుతాను. ఒకవేళ కేబినెట్ నా మీద వేటు వేయాలని సిఫార్సు చేసినా… దానికి సహేతుకమైన కారణాలు చూపాల్సి ఉంటుంది. నేను అసాంఘిక కార్యకలాపాలకు, సంఘ వ్యతిరేక కార్య కలాపాలకు, దేశ ద్రోహానికి పాల్పడిన పరిస్థితి ఉంటేనే నా సభ్యత్వం రద్దు చేయబడుతుంది తప్ప ధ్వేషం, పగతో తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చూస్తే సాధ్యం కాదు.
కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తున్నదేమో?
తెలంగాణ శాసనమండలిలో నా సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సాధ్యమే కాదు. కానీ తెలంగాణలో నడుస్తున్న కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం నా సభ్యత్వం రద్దు చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వాళ్ల ఆటలు సాగవు. గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే నన్ను టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గిరిజన గూడేలు, తండాల అభివృద్ధి కోసం 400 కోట్లతో డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయమని కోరినందుకు నామీద కక్ష సాధిస్తున్నారు. నేను టిఆర్ఎస్ బెదిరింపులకు భయపడే పరిస్థితే లేదు. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన టిఆర్ఎస్ వత్తిళ్లకు లొంగుతారని నేను నమ్మడంలేదు.