తెలంగాణ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను ఆయన సోమవారం కలిశారు. తనకు మండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేసిన విషయమై ఛైర్మన్ తో భేటీ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీ మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ రాములు నాయక్ మీద అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ కు ఫిర్యాదు చేయడం, ఛైర్మన్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాములు నాయక్ ఛైర్మన్ ను కలిసిన తర్వాత సంచలన కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు చదవండి.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన వ్యక్తి రాములు నాయక్. ఆయన టిఆర్ఎస్ ఫౌండర్ మెంబరే. కానీ ఆయనను పార్టీ తరుపున కాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు గులాబీ బాస్ కేసిఆర. కేబినెట్ ఆమోదించి గవర్నర్ కు సిఫార్సు చేస్తే గవర్నర్ ఎమ్మెల్సీగా రాములు నాయక్ ను నామినేట్ చేశారు. రాములు నాయక్ చట్ట రిత్యా చూస్తే శాసనమండలిలో టిఆర్ఎస్ సభ్యుడిగా పరిగణించలేరు అనేది రాములు నాయక్ వాదన. అలాంటప్పుడు తనపై వేటు వేయాలని టిఆర్ఎస్ ఎల్పీ తరుపున ఎలా ఫిర్యాదు చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోమవారం మండలి ఛైర్మన్ ను కలిసిన ఆయన తన వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలని కోరారు.
మండలి చైర్మన్ నుండి నోటిస్ ఇచ్చినందుకు వివరణ ఇచ్చానని చెప్పారు. తనకు నాలుగు వారాలు గడువు కావాలని ఛైర్మన్ ను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే తనను ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నియమించారో చెప్పాలని రాజ్ భవన్ వర్గాలను కోరినట్లు చెప్పారు. గవర్నర్ నుంచి సమాచారం రాగానే శాసనమండలి ఛైర్మన్ నోటీసుకు వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. అందుకోసమే నాలుగు వారాల సమయం కోరినట్లు వివరించారు.
తనకు సోషల్ వర్కర్ గానే నాకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని రాములు నాయక్ వెల్లడించారు. కానీ తన పట్ల చైర్మన్ స్పందన ఏమాత్రం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుడిని ఐనందుకే కేసీఆర్ నన్ను టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తన మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుపారీ ఇచ్చి తనను అంతమొందించే కుట్ర జరుగుతోందని భయాందోళన వ్యక్తం చేశారు. *నన్ను ఖతం చేయాలని చూస్తున్నారని, ఈ విషయంలో తనకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
తాను కాంగ్రెస్ సభ్యుడిని కాదని మరోమారు స్పష్టం చేశారు. ఎస్టీ సమస్యల పైనే రాహుల్ గాంధీని కలిసానని చెప్పారు. టీఆరెస్ లో చేరిన వాళ్ళకు ఒక న్యాయం … మాకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టు మెట్లెక్కడమే కాదు… రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాని వెల్లడించారు.