సమాకాలీన రాజకీయాలలో ‘మూడో కన్ను’ ఉన్న ఏకైక నాయకుడు.
తాను తప్ప రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా సన్నాసులని అనగలిగే ధీమా ఉన్నవాడు
ఇచ్చిన మాట కోసం తలనరుక్కుంటానని ఎక్కడబడితే అక్కడ ఛాలెంజ్ చేసే సత్తా ఉన్నవాడు
ఇపుడు జడిసిపోతున్నాడు… తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, పార్టీలోపల బయట ఛండశాసనుడనుకుంటున్నపుడు ఆయనలో తత్తరపాటు కనిపిస్తున్నది. నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ఇదొక విధంగా ఆయనకు పరాభవమే. మొదటి పరాభవం ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎదురయింది. గోల్డెన్ జూబిలీ ఉత్సవాలనపుడు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలసి ఒక కార్యక్రమానికి వచ్చినా మాట్లాడకుండా వెనుదిరిగిపోయారు. తెలంగాణ ఉద్యమానికి గ్రౌండ్ జీరోగా పేరు మోసిన ఈ ఉద్యమాల ఖిల్లాలో కెసియార్ జీరో అయ్యారని విమర్శలొచ్చాయి. రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి కెసిఆర్ ఒక్క సారి కూడా రాలేదు. ఒక్కసారి కూడా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడలేదు.రాష్ట్రపతి వచ్చినపుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు అంటే సభలో ఉన్న విద్యార్థులు కెసియార్ డౌన్ డౌన్ అని నినాదాలు చేయవచ్చని, గొడవ సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలొచ్చాయని మీడియా రిపోర్టు చేసింది.
ఇపుడిలాంటి పరిస్థితే ఎదురువుతుందని నిన్న వరంగల్ లో జరగాల్సిన ఆయన ఆశీర్వాద సభ రద్ద చేసుకున్నారు. రద్దు చేసుకుంటున్న విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించే ధైర్యం కూడా పార్టీ లేకుండా పోయింది. రాజకీయ వర్గాల కథనం ప్రకారం , సభ పెడితే అసమ్మతి వాదులు, పెద్ద ఎత్తున గొడవలు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలచెప్పడంతో ఆయన సభను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. లేకపోతే, అదివారం ఆయన ఉపన్యాసంతో వరంగల్ మరొకసారి దద్దిరిల్లిపోవలసి ఉండింది.
ఉస్మానియా విద్యార్థులను చూసి భయపడితే, ఇపుడు వరంగల్ లో ఆయన అసమ్మతి వాదుల ను చూసి బెంబేలు పడిపోతున్నారు. ఎంత మార్పు.
ఉస్మానియి లాగే తెలంగాణ రాజకీయాల కు వరంగల్ కూడా ఒక కేంద్రం. రాజకీయ మార్పు తీసుకురావాలనుకుంటున్నపుడలా పార్టీలు వరంగల్ లో బహిరంగ సభ పెడుతుంటాయి. కాంగ్రెస్ హిస్టరీచూడండి. ఎన్నికీలకమయిన సభలను వరంగల్ లో కాంగ్రెస్ ఏర్పాటుచేసిందో తెలుస్తుంది.
ఇక టిఆర్ ఎస్ కూడా అంతే, తెలంగాణ ఉద్యమంలో పింక్ పార్టీ ఏర్పాటు చేసిన అతి పెద్ద బహిరంగసభ వరంగల్ లోనే జరిగింది. అది 2010 డిసెంబర్ 16 న జరిగింది.
తెలంగాణ మీద జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ నివేదిక పూర్తవుతున్న తరుణంలో కెసియార్ ఈ సభ ఏర్పాటుచేశారు. 12 నుంచి 15 లక్షల మంది దాకా ప్రజలు హాజరయ్యారని అంచనా. ఈ సభకు కనీసం 20 లక్షల మంది హాజరవుతారని పార్టీ భావించింది. ఈ స్థాయిలో మీటింగ్ జరిగేదేనని, కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా చాలా ఇబ్బందులెదురయ్యాయని చెబుతారు. దీనికితోడు విపరీతంగా వాహానాలలో జనం రావడంతో దాదాపు 20 కి.మీ మేరా ట్రాఫిక్ జామ్ కావడంతో మరొక అయిదారు లక్షల మంది రోడ్ల మీద ట్రాఫిక్ లో చిక్కుకు పోయారని చెబుతారు. పార్లమెంటులోతెలంగాణ బిల్లు తొందరగా ప్రవేశపెట్టండి , ప్రజలు ఇక్కడ సహనం కోల్పోతున్నారని ఈ సభ నుంచే కెసియార్ యుపిఏ ప్రభుత్వానికి హచ్చరిక చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో టిఆర్ ఎస్ వరంగల్ జిల్లాలను వూడ్చేసింది.రెండు చోట్ల తప్ప అన్ని స్థానాలను గెల్చుకుంది.
ఇటువంటి వరంగల్ లో ఆదివారం నాడు అంటే అక్టోబర్ 7న పబ్లి క్ మీటింగ్ జరగాల్సి ఉండింది. అంతా మళ్లీ అదొక వరవడి అవుతుందని అనుకున్నారు. వరంగల్ మీటింగ్ 2019 ఎన్నికల్లో తెరాస ఘనవిజయానికి బాట వేస్తుందనుకున్నారు. కెసియార్ మరొక విజృంభించి గర్జిస్తారనుకున్నారు. ఆయన ఉరుములాగా ఉరుముతారనుకున్నారు. అయితే, సభ రద్దయింది. చడీ చప్పుడు లేకుండా వరంగల్ సభను రద్దు చేసుకున్నారు. ఒక్క ప్రకటనకూడా లేదు.
వరంగల్ సభ గురించి అధకారికంగా ప్రకటన చేశారు. పార్టీ ప్రకటించిన దాని ప్రకారం నిజామాబాద్ (అక్టోబర్ 3) నల్గొండ (అక్టోబర్ 4), వనపర్తి (అక్టోబర్ 5) సభల తర్వాత అక్టోబర్ 7న వరంగల సభ జరగాలి.
సభ ఎందుకు రద్దయింది… ఉస్మానియా తరహా భయమే కారణం.
పాత వరంగల్ జిల్లా ప్రాంతంలోని 10 నియోజకవర్గాలలో ఒక్క వరంగల్ తూర్పు తప్ప అన్ని నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, సమస్య అక్కడే వచ్చింది. ప్రకటించిన ఆ ఒక్క నియోజకర్గం వల్లే సిటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయింది. అభ్యర్థుల పేర్ల ను ప్రకటించిన నియోజకవర్గాలన్నింటి అసమ్మతి చెలరేగుతూ ఉంది. స్వయాన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఒక రౌండ్ తన బలగాన్ని వరంగల్ కు రప్పించి ప్రదర్శన చేయించారు. వేలాది మంది ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ కు వచ్చి స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని కోరారు. వరంగల సభలో వీరంగా కడియం శ్రీహరికి అనుకూలంగా నినదాలు చేసే ప్రమాదం ఉండింది. ఇదే విధంగా సురేఖ మనుషుల కూడా సభలో ప్రవేశించి అలజడి సృష్టించేవారట.పాలకుర్తిలో దయాకర్ రావు పేరును ప్రకటించడానికి ఒరిజినల్ టిఆర్ ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే, దయాకర్ రావు టిడిపినుంచి ఫిరాయించి, సీటును తన్నుకుపోవడం నియోజకవర్గం టిఆర్ ఎస్ లో ఒక బలమయిన వర్గానికి ఇష్టం లేదు. ఇదే విధంగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వడానికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది.జనగాం నియోజకవర్గంలో కూడా అసమ్మతి కుతకుత ఉడుకుతూ ఉంది. అక్కడ యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పార్టీ నేతలు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. చాలా చోట్ల అసమ్మతి వాదులు కెసియార్ స్వయంగా ప్రటించిన అభ్యర్థిని గెలిపించలేమని ప్రకటిస్తున్నారు.
ఇలా ప్రతిచోట అసమ్మతి రగులుతూ ఉంది. అసమ్మతి నేతలను చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందువల్ల వాళ్లంతా సభకు వచ్చి గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈ జిల్లాలో నుంచి పార్టీ నేతల నుంచి నివేదికలు అందడంతో సభను వాయిదా వేసుకున్నారని మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఏమయినా వరంగల్ సభ వాయిదావేసుకోవడం పవర్ ఫుల్ ముఖ్యమంత్రి కెసియార్ కు మరొక పరాభవమే.