కాళేశ్వరం వివాదంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను మాజీ ఆర్థిక మంత్రి హోదాలో పనిచేసినప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి వివరాలు కమిషన్ ముందు ఉంచినట్టు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాల్సిన అవసరం తనకు ఏమీ లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ తన నింధిత ధోరణిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టు రూపకల్పనలో తన పాత్రను స్పష్టంగా వివరించిన ఈటల.. మంత్రివర్గ ఉపసంఘం లేకుండా అలాంటి పెద్ద ప్రాజెక్టు ముందుకు సాగలేదని తేల్చారు. అనేక అంశాల్లో రీడిజైనింగ్ సూచనలు మంత్రివర్గ సబ్ కమిటీ నుంచి వచ్చాయని, వాటికి సంబంధించిన అన్ని జీవోలు, సిఫారసులు త్వరలో బయట పెడతానని చెప్పారు. మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, కేబినెట్ చర్చల అనంతరంగా మాత్రమే నిర్ణయాలు జరిగాయని గుర్తుచేశారు.
ఈ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్ సంతకాలతోనే ప్రతీ డాక్యుమెంట్ ఆమోదం పొందిందని స్పష్టంగా తెలిపారు. కడియం శ్రీహరి, జూపల్లి, తుమ్మల వంటి అప్పటి మంత్రులందరికీ ఈ వివరాలు తెలుసునని చెప్పారు. అందుకే ఇప్పుడు రాజకీయ లబ్దికోసం ఈ అంశాన్ని వక్రీకరించొద్దని హితవు పలికారు. నిజంగా ధైర్యం ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.
ఈటల వ్యాఖ్యలు చూస్తుంటే, రాజకీయ ప్రతాపం కంటే తన భాగస్వామ్యంపై నమ్మకం బలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అసలైన నిజాలు త్వరలో బయటపడతాయని, ఎవరు తప్పు చేశారో సమయం చెబుతుందన్న ధైర్యం ఆయన మాటల్లో కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కాళేశ్వరం కమిషన్‌ను మరింత వేడెక్కించబోతోంది.