తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసినట్టే కనిపిస్తోంది. “మంత్రులు కమీషన్లు తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు చేయడం లేదు” అనే ఆరోపణలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ సాగాయి. “ఇదేం ప్రభుత్వం.. కమీషన్ లేకుండా ఫైళ్లకు ముందుకు కదలడం లేదు. మంత్రులూ, వారి అనుచరులూ ఏకంగా 30 శాతం వసూలు చేస్తున్నారట. ఇంతకీ మంత్రివర్గం మొత్తమే కమీషన్ బృందమా?” అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, గతంలో సచివాలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘటనను గుర్తుచేస్తూ.. “అప్పుడు ఎవ్వరూ స్పందించలేదు, కనీసం ఇప్పుడు అయినా నిజం బయటికి వచ్చిందంటూ” కొండా సురేఖను వ్యంగ్యంగా అభినందించారు.
అయితే కేటీఆర్ నిలదీత ఇక్కడితో ఆగలేదు. “ఇంతకీ కమీషన్ తీసుకున్న వారు ఎవరు? పేరు పెట్టకుండా ఆరోపణలు ఎందుకు? ధైర్యంగా మంత్రుల పేర్లు బయటపెట్టండి. లేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి?” అంటూ సురేఖను నేరుగా సవాల్ చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి.. “మీ మంత్రి చేసిన ఆరోపణలు మీకూ తెలుసు, దర్యాప్తు చెయ్యగలరా?” అని నిలదీశారు. మొత్తంగా ఈ తాజా పరిణామం తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కి మరింత బెంబేలెత్తించేలా ఉంది.