టిఆర్ఎస్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి షాక్

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డ్డి కి స్వంత గ్రామంలో ఎదురు దెబ్బ తగిలింది.  సునీతా మహేందర్ రెడ్డి స్వగ్రామం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ది విజయ కేతనం ఎగురవేశాడు. దీంతో సునీతా మహేందర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది.

వంగపల్లిలో టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధిగా ఒగ్గు  యాదమ్మ బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి కానుగు కవిత బాలరాజు, ఇండిపెండెంట్ గా చంద్రగాని నిరోషా రంగంలోకి దిగారు. స్వగ్రామంలో టిఆర్ ఎస్ అభ్యర్ధిని గెలిపించుకొవాలని ప్రయత్నించిన సునీతా మహేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. టిఆర్ ఎస్ బలపర్చిన ఒగ్గు యాదమ్మ  పై కాంగ్రెస్ బలపర్చిన కానుగు కవిత బాలరాజు 157 ఓట్లతో విజయం సాధించారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. 

 

గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి స్థానిక సంస్థల ద్వారానే రాజకీయాలలోకి ప్రవేశించారు. 2001 లో ఎంపిటిసిగా ఎన్నికై ఎంపీపీగా పని చేశారు. 2006 నుంచి 2011 వరకు వంగపల్లి  సర్పంచ్ గా పని చేశారు. 2014 లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లో అడుగు పెట్టారు. ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మంత్రి పదవి కోసం సునీతా మహేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. స్వగ్రామంలో సర్పంచ్ స్థానం గెలుచుకోకపోవడంతో అంతా షాకయ్యారు. 2013 సర్పంచ్ ఎన్నికల్లో కూడా వంగపల్లిలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.  

మంత్రి పదవికి పోటి పడుతున్న సునీతా మహేందర్ రెడ్డి స్వగ్రామంలో కనీసం సర్పంచ్ ను గెలిపించుకోకపోవడం చర్చనీయాంశమైంది. గ్రామంలో సునీతా మహేందర్ రెడ్డి మీద వ్యతిరేకత వల్లనే  ఈ విధంగా జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ఉన్నత పదవిలో ఉన్నా గ్రామ అభివృద్దిని పట్టించుకోలేదని, అందుకు తగిన మూల్యంగానే ఇలాంటి ఫలితాలు వచ్చాయని అంతా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సునీతా మహేందర్ రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ గెలవడంతో సునీతా మహేందర్ రెడ్డి పనితీరు అర్ధమవుతుందని కాంగ్రెస్ నేతలు అన్నారు.