ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులుగా కన్ఫామ్… ప్రగతి భవన్ కు రాక

తెలంగాణ కేబినేట్ విస్తరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత రెండు నెలలుగా ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎవరిని అదృష్టం వరించనుందో అన్న చర్చ అందరిలో జరుగుతుంది. అయితే మంగళవారం తెలంగాణ కేబినేట్ మంత్రులుగా పది మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఫోన్ లో  మాట్లాడి ప్రగతి భవన్ కు పిలుస్తున్నారు. సీఎం ఫోన్ వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా ప్రగతి భవన్ చేరుకుంటున్నారు.

 కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ కు సీఎం నుంచి కాల్ రావడంతో ఆయన ప్రగతి భవన్ కు చేరుకున్నారు. దీంతో కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 20 1959న కరీంనగర్ జిల్లాలో జన్మించారు. బిఏ వరకు చదువుకున్నారు. సింగరేణి కార్మికునిగా తన జీవితం ప్రారంభించాడు. 2004లో తొలి సారిగా మేడారం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసి 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటి చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో ధర్మపురి నుంచి పోటి చేసి గెలిచారు. 2014 మరియు 2018లో కూడా జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పని చేశారు. ప్రస్తుతం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది. ముందుగా ఆయనకు స్పీకర్ లేదా డిప్యూటి స్పీకర్ గా అవకాశం ఇస్తారనుకున్నా అనూహ్యంగా ఆయనను మంత్రి పదవి వరించనుంది.  

మరో ఎమ్మెల్యే పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపిలో సీనియర్ నేతగా పని చేశారు. కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరారు. అప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తదని అంతా అనుకున్నా రాలేదు. దాంతో ఆయనకు ఈ సారి కేబినేట్ లో బెర్తు ఖాయమైంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. 

ఆయన వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఖాయమని తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అంతా చర్చించుకున్నారు. అంతా అనుకున్నట్టే ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది. ఎర్రబెల్లికి ఏ శాఖ దక్కనుందో అని వరంగల్ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన మిగిలిన నేతలు సాయంత్రం వరకు ప్రగతి భవన్ కు చేరుకుంటారని తెలుస్తోంది.