ముగ్గురు టిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపరాఫర్

జనవరి 20 నాటికి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చనే సమాచారంతో రోజు రోజుకి అందరిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే  ఈ సారి కేబినేట్ లోనైనా మహిళలకు అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ సారి ముగ్గురు టిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సువర్ణావకాశం దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి, స్పీకర్ లేదా డిప్యూటి స్పీకర్ పోస్టులు ఇచ్చి మహిళలను గౌరవించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. 

మెదక్ నుంచి గెలిచిన పద్మాదేవేందర్ రెడ్డి పేరు మంత్రి పదవికి బాగా వినిపిస్తోంది. గతంలో డిప్యూటి స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. మహిళలను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తుండడంతో మంత్రి పదవికి పద్మా దేవేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డిప్యూటి స్పీకర్ గా పద్మా సమర్ధవంతంగా పని చేయడంతో స్పీకర్ గా కూడా నియమిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే స్పీకర్ పదవి చేపట్టడానికి పద్మా దేవేందర్ రెడ్డి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఆమెకు మంత్రి వర్గంలో పదవి దక్కే అవకాశం ఉంది.

గొంగిడి సునీతా ఆలేరు నుంచి గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఆమె విప్ గా కొనసాగారు.ఈ సారి ఆమెకు డిప్యూటి స్పీకర్ పదవి లభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి వర్గంలో స్థానం కోసం ఆశించినా పద్మాదేవేందర్ రెడ్డి రేసులో ఉండడంతో సునీతా మహేందర్ రెడ్డికి స్పీకర్ లేదా డిప్యూటి స్పీకర్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

రేఖా నాయక్ ఖానాపూర్ నుంచి గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగానే ఆమె కొనసాగారు. ఈ సారి ఆమెకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. ఎస్టీ నేపథ్యం, మహిళా ఎమ్మెల్యే కావడంతో ఆమెకు కేబినేట్ హోదా ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే గొంగిడి సునీత స్పీకర్ లేదా డిప్యూటి స్పీకర్ పదవికి ఒప్పుకోకుంటే రేఖా నాయక్ ను డిప్యూటి స్పీకర్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ లోపు ఇతర పార్టీల నుంచి మహిళా ఎమ్మెల్యేలు వచ్చి టిఆర్ఎస్ లో చేరితే సమీకరణాలు మారవచ్చు. కానీ ఈ దఫా మాత్రం మహిళలకు ప్రముఖ స్థానాలు ఇచ్చి గౌరవించాలని, మహిళా మంత్రి లేరు అని మాట్లాడుతున్న ప్రతిపక్షాల నోర్మూయించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది.