అభ్యర్థుల్ని మార్చితే, పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందా.?

రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా తనదైన వ్యూహం వుంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అధికార వైసీపీ అనేక వ్యూహాల్ని రచిస్తోంది. అంతర్గత సర్వేలకు అనుగుణంగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పలుమార్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

గడప గడపకీ మన ప్రభుత్వం.. సహా పలు ‘పబ్లిసిటీ’ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్, ఆయా కార్యక్రమాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనేలా చర్చలు తీసుకున్నారు. నిజానికి, అదొక మంచి అవకాశం వైసీపీ ఎమ్మెల్యేలకి. కానీ, కొందరు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించారు.

తమకు బదులుగా తమ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని జనాల్లోకి పంపించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు అని కూడా చూడకుండా జనం, ఆయా నేతల్ని నిలదీయడం చూశాం. నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆలోచన లేకుండా కొందరు నేతలు వ్యవహరించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే నేరుగా ఫిర్యాదులు వెళ్ళాయి.

వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాక.. చివరికి టిక్కెట్లను నిరాకరించడం మొదలు పెట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాగని, ఆయా నేతల్ని పార్టీ నుంచి బయటకు పంపాలనే ఆలోచన వైసీపీ అధినేతకు లేదు. కానీ, టిక్కెట్టు దక్కదన్న నిర్ణయానికి వచ్చేసిన కొందరు వైసీపీ నేతలు, పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

ఇక, అభ్యర్థుల మార్పుతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత వైసీపీ మీద తగ్గుతుందా.? అంటే, కొంతమేర తగ్గుతుందేమోగానీ, పూర్తిగా కాదు.! ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వుంది. ప్రధానంగా రోడ్లు, అభివృద్ధి వంటి కీలక విషయాల్లో ప్రభుత్వంపైనా ప్రజలకు కొంత వ్యతిరేకత వున్నమాట వాస్తవం.

అభ్యర్థుల మార్పు అనేది ఓ రాజకీయ వ్యూహం మాత్రమే. అయినా, ఎంతమందినని మార్చగలరు.? జగన్ తప్పేమీ లేదు, ఎమ్మెల్యేలదే తప్పంటూ ఓ ప్రచారాన్ని బలవంతంగా రుద్దితే అది నెగెటివ్ ఫలితాల్నే ఇస్తుంది.