ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం జగన్ తనదైన శైలిలో పాలన చేపట్టారు. కేబినెట్ మంత్రులకు రెండున్నరేళ్లే పదవులు అని అన్నారు. అనంతరం కొత్తవారికి అవకాశాలిస్తామని తెలిపారు. అందుకు కేవలం పనితీరే ప్రాతిపదిక కాదని.. సామాజిక సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు! అన్నట్లుగానే అలానే చేశారు. మరికొంతమందిని రెండోదఫా కూడా కొనసాగించారు. ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రుల స్థానాలను కూడా మార్చే విషయంలో మొహమాటాలకు పోవడం లేదని తెలుస్తుంది.
ఈ సమయంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సిట్టింగులనే కొనసాగించి ఇబ్బందులు కొనితెచ్చుకోవాలని జగన్ భావించడం లేదని తెలుస్తుంది. ఈ సమయంలో పలువురు సిట్టింగులను ఇప్పటికే మార్చిన సంగతి తెలిసిందే. మరికొంతమందికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ఈ సమయంలో కొంతమంది నేతలు బయట బాదపడుతుంటే.. మరికొంతమంది ఇంట్లో తలుపులేసుకుని బాదపడుతున్నారని చెబుతున్నారు.
మరోపక్క మెజారిటీ నేతలు జగన్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతుండగా.. ఇంకొంతమంది మాత్రం తమ అనుచరులను ఎగ్గొడుతున్నారు.. వారితో ప్రెస్ మీట్ లు పెట్టి తాముచెప్పలేని, తాము అనలేని మాటలను వారితో అనిపించే పనికి పూనుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో అధికార వైసీపీ నేతలకు రివర్స్ సమస్య వచ్చీందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై ఒక ఫిర్యాదు చేసేవారు! ప్రత్యక్షంగా చెప్పలేకపోయినా.. ఆఫ్ ద రికార్డ్ జర్నలిస్ట్ ల వద్ద వాపోయేవారు. అదేమిటంటే… జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు.. ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదు అని!! అయితే… ఇప్పుడు లెక్కమారింది!! సీఎంఓ నుంచి ఫోన్ వస్తుంది.. జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చి పిలుస్తున్నారు. ఇప్పుడు ఇదే వారి టెన్షన్ అని అంటున్నారు.
సీఎంఓ నుంచి ఫోన్ వచ్చినా.. జగన్ నుంచి పులుపు వచ్చి కలవాలని చెప్పినా వైసీపీ సిట్టింగులకు ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు. సీఎంఓ నుంచి ఫోన్ రాగానే నీరసంగా బయలుదేరుతున్నారని చెబుతున్నారు. దీంతో… సీన్ రివర్స్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
కాగా… సర్వేల ఫలితాలు, కార్యకర్తల మనోభిష్టాలు, ప్రజల అభిప్రాయాలు మొదలైన కారణాలతో ఇన్ ఛార్జ్ ల మార్పుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారికంగా 11 మంది ఇన్ ఛార్జ్ లను మార్చగా… మరింత మందిని మార్చినట్లు తెలుస్తుంది.