టిఆర్ఎస్ కీలక నేతకు కేబినేట్ లో స్థానం అనుమానమే

ఆయన మాట మాట్లాడితే ప్రత్యర్దుల గుండెల్లోకి గుచ్చుకుంటుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేస్తాడు. తండ్రి లక్షణాలు అలవర్చుకున్న ఆయన అనర్గళంగా ప్రసంగిస్తాడు. గతంలో సోనియా గాంధీ మీద కామెంట్స్ చేసి సెన్సేషనల్ అయ్యాడు. తెలంగాణ కేబినేట్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆయన చేపట్టిన రెండు శాఖల్లోను తనదైన ముద్ర వేశాడు. కానీ అనుకోకుండా పార్టీ బాధ్యతలను చేపట్టడంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో నెగ్గుకు రావడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక ఆయనను కేబినేట్ లోకి తీసుకునేది అనుమానమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇంతకీ ఆయన ఎవరంటే సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు. కేటిఆర్ ఇటివల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టారు. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదన్న సంకేతాలతో కేటిఆర్ నెక్పేంటి అన్నది చర్చనీయాంశమవుతోంది. ముందుగా అందరు భావించినట్టే కేటిఆర్ కు మంత్రి వర్గం లో స్థానం ఖరారు అని అనుకున్నారు. కానీ పార్టీ బాధ్యతలు భుజస్కందాల పై ఉండడంతో అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలో నెగ్గుకు రావడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో పార్టీ బాధ్యతల్లోనే పూర్తి స్థాయిగా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లోను టిఆర్ఎస్ విజయ దుందుంభి మోగించవచ్చనే అభిప్రాయాలను టిఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.   

2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్, పురపాలక, ఐటి పరిశ్రమల శాఖలను కేటిఆర్ నిర్వహించారు. దేశ విదేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టి హబ్ ఐటి ఇంక్యుబేటర్ రాష్ట్రంలో వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలకు ఊతమిచ్చింది. తెలంగాణ ఐటి శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. భారతదేశంలోనే బెంగళూరు ఐటి విభాగం బలంగా ఉంది. బెంగళూరుతో సమానంగా తెలంగాణ నుంచి ఐటి పనులు జరుగుతున్నాయి. 

కేటిఆర్ ఇప్పటికే తెలంగాణలో 16 పార్లమెంటు సీట్లు గెలవాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు అన్ని స్థాయిల్లో శిక్షణనిచ్చి పార్టీ కేడర్ ను ఉత్తేజితుల్ని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం తన ఏర్పాట్లలో ఉన్నారు. రాజకీయ నాయకులను కలుస్తూ ఫ్రంట్ కు బలం చేకూర్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. కేటిఆర్ కి ఉన్న వాగ్దాటి, యువ నాయకులతో  ఉన్న పరిచయం కూడా ఫెడరల్ ఫ్రంట్ కు బలం చేకూరుస్తుందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.  

 

కేటిఆర్ ఇటువంటి సమయంలో ప్రభుత్వంలో బాద్యతలు చేపడితే పార్టీ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేక పోవచ్చని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు పూర్తిగా పార్టీ బాధ్యతలు చేపడితేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటిఆర్ విషయంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఆయనను పార్టీకి పరిమితం చేస్తారా లేక ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కేటిఆర్ భవిష్యత్తు ఎటు వైపు అనే చర్చ అందరిలో జోరుగా సాగుతోంది.

 

ఇది కూడా చదవండి

జాతీయ పార్టీలకు అంత జ్ఞానం ఎక్కడుంది, కవిత షాకింగ్ కామెంట్స్