జీవితంలో మంచి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురిమలు పలికిస్తూనే ఉంటాయి . రోజులు,నెలలు, సంవత్సరాలు చక చకా సాగిపోతూ ఉంటాయి . గడిచిపోయిన కాలంలో మనం తిరిగిన ప్రదేశాలు , కలసిన వ్యక్తుల ఫోటోలు చూసినప్పుడు ఆయా ఘటనలు మన స్మృతి పథంలో మెదులుతూ ఉంటాయి . జర్నలిస్టు గా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎందరో మహానుభావులు, మహనీయ వ్యక్తులను కలవడం , మాట్లాడటం జరిగింది . వారి వ్యక్తిత్వ ప్రభావం ఎంతో కొంత నామీద పడిందనే చెప్పాలి . అలాంటి గొప్పవారి ఆశీస్సులతో , ప్రోత్సాహంతో ఎదిగి వొదిగినవాడిని .
ఆ జ్ఞాపక చిత్రాలు అలాంటి మహనీయ వ్యక్తులను ఇప్పటి తరం వారికి పరిచయం చెయ్యాలనే సంకల్పం తోనే ఈ ముచ్చట్లు
హిందీ సినిమా రంగంలో విశేషమైన ప్రతిభ కలిగిన కెమెరామన్ , డైరెక్టర్ గోవింద్ నిహలాని . నిహలానితో నేను 1991 అంతర్జాతీయ చిత్రోత్సవం చెన్నయ్ లో జరిగినప్పుడు కలవడం జరిగింది . అప్పుడు దర్శకుడు బి . నరసింగ రావు సినిమా “మట్టి మనుషులు ” ప్రదర్శన సందర్భంగా నేను కూడా చెన్నయ్ వెళ్ళాను .
జనవరి 13న ఇద్దరం కలసి నగరంలో కారులో గంటసేపు ప్రయాణించాము . అప్పుడు జర్నలిస్టుగా ఆయనతో అనేక విషయాలను మాట్లాడటం జరిగింది . గోవింద్ నిహలాని ఎంత ప్రతిభావంతుడో అంత నిరాడంబరుడు , నిగర్వి . ఆయనకు 6 జాతీయ అవార్డులు వచ్చాయి , 5 ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి .
1996లో ఆయన స్క్రిప్ట్ “ద్రోహకాల్ “ను కమలహాసన్ తమిళంలో “కుర్తి పునాల్ ” చిత్రంగా నిర్మించాడు . ఈ చిత్రానికి 68వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ సినిమాగా ఎంపికయ్యింది . గోవింద్ నిహలాని 19 డిసెంబర్ 1940లో పాకిస్థాన్లోని కరాచీలో జన్మించాడు . 1947లో దేశ విభజన సందర్భంగా భారత దేశానికి వచ్చాడు . మొదట్లో సినిమాటోగ్రాఫర్ గా వున్న నిహ్లానీ ఆ తరువాత దర్శకుడుగా , రచయితగా , నిర్మాతగా మారాడు . ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు 1990లో గోవింద్ నిహలాని దర్శకత్వం వహించిన “ద్రిష్టి ” సినిమా అంతర్జాతీయ చిత్రత్వంలో ప్రదర్శనకు ఎంపికయ్యింది . ఈ చిత్రంలో శేఖర్ కపూర్ , డింపుల్ కపాడియా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు .
గోవింద్ నిహలాని అందరిలాంటి దర్శకుడు కాదు, భిన్నమైన కథలను సహజమైన పద్దతిలో తెర మీద చూపాలనే తపన కలిగినవాడు , ఆయన స్వతహాగా ఛాయాగ్రాహకుడు కావడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ . ఆయన ఆలోచనలను యధాతతంగా తెర మీద చిత్రీకరించగలిగిన ప్రతిభా సంపన్నుడు నిహలాని . ఆయన 1983లో దర్శకత్వం వహించిన “అర్ధ సత్య ” సినిమాను రెండు మూడు సార్లు చూశాను . ఆ సినిమా నాకు బాగా నచ్చింది . అలాంటి గొప్ప దర్శకుడు, ఛాయాగ్రాహకుడు నిహలానీతో మాట్లాడటం నిజంగా మర్చిపోలేని జ్ఞాపకమే .
-భగీరథ