ఎన్టీఆర్ కు సినిమా అంటే ప్రాణం

35 సంవత్సరాలపాటు సినిమా రంగంలో తిరుగులేని కథానాయకుడుగా వున్న రామారావు ఆ రంగాన్ని వదిలిపెట్టి 1982లో ప్రజలకు సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చాడు . ఎన్టీఆర్ తో నాకు దాదాపు మూడు దశాబ్దాల పరిచయం వుంది . సినిమా రంగంలో ఉండగా , రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా అనేక ఇంటర్వ్యూలు చేశాను . ఆయన ఎంత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చాలా క్రమ శిక్షణతో ఉండేవాడు .

రామారావుగారితో ఇంటర్వ్యూ అంటే ఒకటే సమస్య . ఉదయం 4 లేదా 4. 30 కు రమ్మనేవాడు . తరువాత టైం అంటే టైమే . ఐదు నిముషాలు ఆలస్యమైనా వూరుకునేవాడు కాదు , మెత్తగా చివాట్లు పెట్టేవాడు , రెండవసారి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు . పెద్దవారిని, చిన్న వారినీ “మీరు ” అని సంబోధించడం రామారావు గారి అలవాటు . ఆయన ఏ ప్రశ్న కైనా జవాబు చెప్పేవాడు . అయితే వెళ్ళగానే ఆయన్ని ఇబ్బంది పెట్టె ప్రశ్నలు మాత్రం అడగకూడదు . నిజానికి ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యడం చాలా కష్టం . ఆయనకి వేసే ప్రశ్నలు ఏమాత్రం నచ్చకపోయినా , లేదా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రవర్తన నచ్చకపోయినా ఆయన ఏమాత్రం మొహమాట పడడు . “మంచిది బ్రదర్ “అని రెండు చేతులతో నమస్కారం పెట్టేస్తాడు .

అంటే ఇక చాలు వేళ్ళు అని . రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఫిలిం జర్నలిస్టుగా మొదట నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు . 1983 జనవరి 9 న ముఖ్యమంత్రి గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఫిబ్రవరి మొదటి వారంలో నాకు (అప్పుడు ఆంధ్ర జ్యోతి వారి జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక ఇంఛార్జిగా ఉండేవాడిని ) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆరోజు ఉదయం రామారావు గారు చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు . టిఫిన్ తెప్పించి తిన్న తరువాత కానీ ఇంటర్వ్యూ మొదలు పెట్టలేదు . నాకు అధికారికంగా ఇంటర్వ్యూ కోసం ఇచ్చిన సమయం 15 నిమిషాలు . కానీ వారిని ఆరోజు 45 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాను . 

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్ .టి . రామా రావు తెలుగువారికి ప్రాతః కాల స్మరణీయుడు . సినిమా రంగాన్నే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ప్రత్యేక ముద్రవేసిన అసామాన్యుడు .  ముక్కుసూటితనం , నిర్భీతీ , నిజాయితీ రామారావు గారికి ఆభరణాలు . కళలంటే ప్రాణం , ప్రజలంటే గౌరవం .అందుకే కళాకారుడిగా తర తరాలు నిలిచిపోయే పాత్రలలో నటించాడు .

రాజకీయ నాయకుడు పేద ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశ పెట్టాడు . ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలవారికి రాజకీయ జీవితాన్ని ఇచ్చాడు . సినిమా అంటే ఆయనకు ఎంతో ప్రాణం .రాజకీయాల్లో వుంది కూడా బ్రహ్మఋషి విశ్వామిత్ర సినిమా చేశాడు . 1986లో అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని ఓ పండుగలాజరిపాడు . ఈ రాజకీయాలను సమూలంగా బాగుచేద్దామని వచ్చాడో ఆ రాజకీయ చదరంగంలో చిక్కుకొని 18 జనవరి 1996లో మృత్యు కౌగిట్లోకి వెళ్ళిపోయాడు .
ఎన్ . టి . రామా రావు ఉత్తేజభరితమైన ఒక ఉజ్వల చరిత్ర  తెలుగువారికి సదా స్ఫూర్తినిచ్చే ఒక స్మ్రుతి చిత్రమ్ .

-భగీరథ