అమరావతిని రాజధానిగా అంగీకరించడం జగన్ ప్రభుత్వానికి ససేమిరా ఇష్టంలేదనేది వాస్తవం. చంద్రబాబు నిర్మాణం మొదలుపెట్టారనే కారణమో, పూర్తి అయితే పేరు మొత్తం ఆయనకే వెళుతుందనే భయమో కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒప్పుకుని అధికారంలోకి వచ్చాక నో అనేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. ఉన్నపళంగా అమరావతిలో నిర్మాన్లను నిలిపివేశారు. రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, సింగపూర్ కన్సార్షియం లాంటి పలు ఆర్ధిక సంస్థలను వెనక్కు పంపారు. అన్నట్టే నిజంగానే అమరావతిని ఎడారి చేస్తారేమో అన్నట్టు వ్యవహరించారు. ఏడాదికి పైబడి భూములిచ్చిన రైతులు నిరసనలు చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి అమరావతిలో పనులను రీస్టార్ట్ చేసే ప్రయత్నం చేసున్నారు.
మరి ప్రభుత్వంలో ఇంత సడన్ మూవ్ ఎందుకంటే కనిపించే ఏకైక కారణం మున్సిపల్ ఎన్నికలు. వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థల్లో గెలవడం వైసీపీకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ జిల్లాల్లో అమరావతి ప్రభావం గట్టిగా కనబడుతుంది. ఈ జిల్లాల్లో కార్పొరేషన్లను గెలవాలంటే అమరావతికి వ్యతిరేక స్వరం వినిపిస్తే కుదరదు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లోనూ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే అమరావతి మీద ఈ ప్రేమ అంటున్నారు. ఇప్పటికిప్పుడు పనుల కోసం 3000 కోట్ల రుణాలు అవసరం. మరి అంత పెద్ద మొత్తం ఇచ్చేదెవరు అనేదే ప్రశ్న.
ఇప్పటికే అప్పుల పరిమితి పెరిగిపోయింది. పైగా అమరావతి విషయంలో ఒక ఖచ్చితమైన కమిట్మెంట్ అంటూ లేదు. ఇవాళ ఉందంటారు, రేపు ఉండదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఋణం ఇచ్చే సాహసం ఎవరు చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవా అంటే తెలుసు. తెలిసి కూడ ఎందుకు ఈ షో అంటే మున్సిపల్ ఎన్నికల కోసమే. అమరావతిని తరలిస్తే గుంటూరు, కృష్ణ జనం పెద్దగా వ్యతిరేకించడంలేదని, అది వారికి కూడ ఇష్టమేనని ప్రభుత్వం చెబుతోంది. ఆ మాటే నిజం కాకపోతే, ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల్లోపు వ్యతిరేకత ఉందని తేలుతుంది. ఈ ఉపద్రవాలన్నింటినీ తప్పించుకోవడానికే అమరావతి మీద సడన్ ప్రేమ అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.