YCP MLA Roja : సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. పంచ్ డైలాగులకి కేరాఫ్ అడ్రస్. రాజకీయ ప్రత్యర్థులపైకి మాటల తూటాల్ని పేల్చడంలో రోజా స్టైలే వేరు. ఏ స్థాయికైనా వెళ్ళి.. (స్థాయి పెంచుకుని అయినా.. స్థాయిని దించేసుకుని అయినా) ప్రత్యర్థుల్ని తన మాటల తూటాలతో ఇరకాటంలో పెట్టగల సత్తా రోజా సొంతం.
అయితే, గత కొంతకాలంగా రాజకీయ విమర్శల విషయంలో రోజా (YCP MLA Roja )కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కానీ, ఆమె మళ్ళీ తన మునుపటి స్టైల్ చూపించేశారు.
మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి హాజరైన ఓ కార్యక్రమంలో రోజా, రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మాటల దాడికి దిగారు.. ముఖ్యమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించేశారు.
రోజా అలా అనర్గళంగా తన మీద ప్రశంసలు కురిపిస్తూ, ప్రత్యర్థులపై విమర్శల నిప్పులు కురిపించేస్తోంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమె మాటల తీరుని ఆస్వాదిస్తూ వుండిపోయారు.
మహిళలపై బాలకృష్ణ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు, కోడెల శివప్రసాద్ ఓ సందర్భంలో మహిళల పట్ల చేసిన ‘చిన్న చూపు’ వ్యాఖ్యలు.. వీటన్నిటినీ ప్రస్తావించారు రోజా.
‘మహిళలకు గౌరవమివ్వని టీడీపీ ఎక్కడ.? మహిళలకు అగ్రస్థానం కల్పించిన వైసీపీ ఎక్కడ.? బోత్ ఆర్ నాట్ సేమ్..’ అంటూ రోజా వ్యాఖ్యానించారు.
ఇదంతా చూశాక, రోజా.. మంత్రి పదవి మీద కన్నేశారనీ, ఈ క్రమంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి తన మునుపటి మాటల వాడి, వేడిని ముఖ్యమంత్రి సాక్షిగా ప్రదర్శించారనీ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.