Vijayasai Reddy : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారిపోనున్నారా.?

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతోంది. ప్రధాన మంత్రిని విజయసాయిరెడ్డి కలవడం ఇదే కొత్త కాదు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీని కలవడం వింత కూడా కాదు.

రాజకీయాల్లో పార్టీలకతీతంగా నాయకుల కలయికలు కనిపిస్తుంటాయి. ఓ రాజ్యసభ సభ్యుడిగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానిని కలిసి, ఆయా అంశాలపై ప్రధానితో చర్చించడం అనేది విజయసాయిరెడ్డి హక్కు, బాధ్యత కూడా.

ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా చాలా అంశాల గురించి ప్రధాని వద్ద విజయసాయిరెడ్డి ప్రస్తావించి వుండొచ్చు, ప్రస్తావించి వుండకపోనూవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అయితే, ఈ భేటీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం మొదలు పెట్టింది.

సోషల్ మీడియా వేదికగా టీడీపీ సానుభూతిపరులు, విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారిపోయారనీ, ఆయన బీజేపీలో చేరబోతున్నారనీ ప్రచారం షురూ చేశారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్న విషయం విదితమే. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి గతంలో అరెస్టయినప్పుడే, విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారబోతున్నారనే దుష్ప్రచారానికి తెరలేపింది టీడీపీ అనుకూల మీడియా.

అప్పటినుంచి ఇప్పటిదాకా ‘అప్రూవర్’ గాలి వార్తలు వినిపిస్తూనే వున్నాయి. విజయసాయిరెడ్డి మాత్రం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా కనొసాగుతూనే వున్నారు.