Omicron : ఒమిక్రాన్‌తో అంత పెద్ద ప్రమాదం పొంచి వుందా.?

Omicron : కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ విషయమై చాలా ఆందోళన నెలకొంది. రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్ దాటేసింది. వేలు దాటి, లక్షల్లోకి ఆ పై కోట్లలోకి నెంబర్ చేరుకోవడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే, ఇప్పటిదాకా వెలుగు చూసిన కోవిడ్ 19 వేరియంట్లన్నింటిలోకీ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని సాక్ష్యాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లోకి కోవిడ్ 19 ఒమిక్రాన్ ఇప్పటికే ప్రవేశించేసింది. ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే ఈ ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశిస్తోంది. వారి నుంచి ఇతరులకు ఒమిక్రాన్ సోకడంపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ప్రస్తుతానికైతే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్‌లోనే వుంది. అయితే, ఆ సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగానే వుండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఒమిక్రాన్ కారణంగా ఐసీయూలో చేరాల్సి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది గనుక, ఒమిక్రాన్ కేసులు డెల్టా తరహాలో.. అంతకు మించిన స్థాయిలో వ్యాప్తి చెందితే మాతరం, సెకెండ్ వేవ్ కంటే భయానక పరిస్థితులు వుండొచ్చు.

ఇంట్లో వున్నాసరే మాస్క్ ధరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోందంటే, పరిస్థితి తీవ్రత ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. రాత్రి వేళల్లో చెమట, తీవ్రమైన ఒళ్ళు నొప్పుల్ని ఒమిక్రాన్ లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాల్సిందే.