దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ధరలు చుక్కలనంటుతున్నాయి. పైగా భారీ వర్షాలతో పంట సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడల్లా రేట్లు తగ్గేలా లేవు. దాదాపు భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలోనూ ధరల్లో కాస్త అటు ఇటుగా హెచ్చు తగ్గులు ఉన్నాయికానీ… కేజీ 150 – 250 మధ్యలో ఉన్నాయని తెలుస్తుంది.
ఇది ప్రస్తుతం దేశంలో టమాటా ధరల పరిస్థితి. ఈ విషయం సామాన్యుడి నుంచి మేధావి వరకూ… పేదవాడి నుంచి ధనికుడి వరకూ ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి గల కారణం ఏమిటి అని అడిగితే… కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా భారీ వర్షాల కారణంగా పంటలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం అని! అయితే చంద్రబాబు మాత్రం రోటీన్ కి భిన్నంగా ఆలోచించారు.
అవును… తాను అధికారంలో ఉండి ఉంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పుకునే చంద్రబాబు… తన ప్రచార కార్యక్రమాల్లో “సైకిల్ పోవాలి” అని స్లోగన్స్ ఇచ్చే చంద్రబాబు… తాజాగా మరోసారి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన ప్రత్యేక జ్ఞానంతో టమాటాల ధరల పెరుగుదలకు గల కారణం కనుగొన్నారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి వైఎస్ జగన్ కారణం అని తేల్చారు చంద్రబాబు.
నవ్విపోదురుగాక… అనుకున్నారో.. లేక, దేశానికి సరిపడా టమాటా పంట ఏపీలోనే పండుతుందని భావించారో.. అదీగాక, కేంద్ర వ్యవసాయమంత్రిగా జగన్ పనిచేస్తున్నారని అనుకుంటున్నారో తెలియదు కానీ… నేడు దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటడానికి జగన్ మోహన్ రెడ్డి కారణం అని చంద్రబాబు కన్ క్లూజన్ ఇచ్చారు.
ఆయన ఊరికే ఆ మాట అనలేదు సుమా… ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారని, అందుకే ఇప్పుడు ధరలు పెరిగాయని అంటున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ తిప్పలు వచ్చేవి కావన్నారు.
దీంతో చంద్రబాబు నిజంగా ఇదే ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తుంటే… ఆయన చెబుతున్నమాటలు, ఇస్తున్న వాగ్ధానాలు, ముందు చూపు గురించిన ముచ్చట్లు విన్నవారేవరైనా.. నిజమే కాబోలు అనుకునే అవకాశం ఉంది. అయితే సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అవ్వడం వల్ల.. ఆయన పాలనను ప్రజలు అద్భుతంగా అనుభవించేయడం వల్ల… నమ్మడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఇలా చంద్రబాబు తనదైన శైలిలో విశ్లేషణలు చేయడంతో “బాబు ఈస్ బ్యాక్” అంటున్నారు ఆయన ఫ్యాన్స్!