నిర్మలమ్మ బడ్జెట్టు.! షరామామూలు కనికట్టు.!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికలకు ముందు అత్యంత కీలకమైన బడ్జెట్ ఇది. సంక్షేమం దిశగా బడ్జెట్ వుంటుందా.? లేదంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిలా ఈ బడ్జెట్ వుంటుందా.? అని గత కొంతకాలంగా బడ్జెట్టు గురించి చాలా రకాల విశ్వేషణల్ని నేషనల్ మీడియాలో, స్థానిక మీడియాలో చూశాం.

కొత్తగా ఏముంటుంది బడ్జెట్టు అంటే.? బడ్జెట్టు.. అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బాదుడు. కాస్త ఎక్కువ, కాస్త తక్కువ.. అంతే తేడా. బాదుడైతే సర్వసాధారణం. అసలు ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ముక్కు పిండి వసూలు చేసే సొమ్ములతో. అక్కడికి మళ్ళీ ఆ జనాన్ని ఉద్ధరించేస్తున్నామంటూ సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలొకటి.

కొత్తగా ఈసారి ఏయే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయబోతున్నారు.? కొత్తగా జనం నెత్తిన ఏం భారం మోపుతున్నారు.? ఇలా చర్చ జరగాలి. కానీ, మన మీడియాకి అంత తీరిక లేదు. బడ్జెట్ ఇలా ప్రవేశపెట్టగానే, అలా స్టాక్ మార్కెట్లు పండగ చేసుకున్నాయట. మరి, సామాన్యుడు ఏం చేయాలి.? వేతన జీవులకు గొప్ప ఊరట దొరుకుతుందనుకుంటే, కండిషన్స్ అప్లయ్.. అంటూ ఊరటనిచ్చినట్లు ప్రకటించారు.. ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు.. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు వ్యవహారంలో. స్లాబులు తగ్గించారు.. దాంతో, ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది.

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. కొన్ని ధరలు తగ్గడం.. కొన్ని ధరలు పెరగడం.. అనేది ఎప్పుడూ వుండేదే. నిజానికి, తగ్గేదేమీ వుండదు. ఓ కోణంలో తగ్గితే, ఇంకో కోణంలో పెరుగుతుంది. అంతిమంగా.. అన్నీ పెరుగుతాయ్. ఈ బడ్జెట్ చెబుతున్నదీ అదే. కోవిడ్ కష్టాలు తీరిపోయాయ్.. అని నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. అలాంటప్పుడు, కోవిడ్ పేరుతో బాదేసిన బాదుడు నుంచి ఉపవశమనం ఇవ్వొచ్చు కదా.?