కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు కాస్తా, సాధారణ ఎన్నికల్ని తలపించాయి. గతంలో ఎన్నడూ ఎక్కడా లేని వింత పరిస్థితి ఇది. అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రెండూ పూర్తిగా కుప్పం మునిసిపాలిటీ పరిధిలో మోహరించాయి. పొరుగు జిల్లాల నుంచీ పెద్దయెత్తున జనాన్ని తరలించి, కుప్పం మునిసిపల్ ఎన్నిక సందర్భంగా అత్యుత్సాహం చూపించాయి రెండు ప్రధాన పార్టీలు.
మంత్రులు కుప్పం మునిసిపాలిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టడం మరో ఆసక్తికరమైన అంశం. అధికారుల్ని అడ్డంపెట్టుకుని అధికార వైసీపీ అడ్డగోలు రాజకీయం చేస్తోందంటూ ఎడా పెడా ప్రెస్‌మీట్లు పెట్టేసి రాజకీయ విమర్శలు చేసేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
కుప్పం అంటే, చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం. అందుకే, కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక ఇంత హాట్ టాపిక్ అయ్యింది. కుప్పంలో టీడీపీని దెబ్బతిస్తే, చంద్రబాబు పొలిటికల్ ఖేల్ ఖతం.. అన్నది వైసీపీ భావన. కాగా, సాధారణ ఎన్నికల తరహాలో కుప్పం మునిసిపాలిటీపై ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు జరిగాయి.. వాటి ఫలితాల్లో వైసీపీకి బంపర్ మెజార్టీ కనిపిస్తోంది.
వాస్తవ ఫలితం ఇందుకు భిన్నంగా ఏమీ వుండకపోవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దాంతో, కుప్పం వేదికగా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ, అత్యంత దిగజారుడు రాజకీయాలు చేసిందనీ, అయినా నైతిక గెలుపు తమదేననీ చంద్రబాబు అంటున్నారు.
ఎప్పుడైతే నైతిక విజయం తమదేనని చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పడం షురూ చేశారో, అప్పుడే టీడీపీ ఓటమి ఖాయమైపోయిందని వైసీపీ అంటోంది. ఒకవేళ చంద్రబాబు తన పవర్ నిరూపించుకోగలిగితే మాత్రం, కుప్పంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లే భావించాలి. కానీ, చంద్రబాబుకి ఆ ఛాన్స్ వుండకపోవచ్చు.