టీడీపీ ‘మూస’ ఆందోళనలతో ఎవరికి నష్టం.?

ఎన్నికలంటే చాలు, ‘అక్రమాలు’ అంటూ గగ్గోలు పెట్టడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. తమ అభ్యర్థుల్ని నామినేషన్ వేయనివ్వడంలేదనీ, అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారనీ, పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తమ పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారనీ పదే పదే ఒకటే ఆరోపణని మళ్ళీ మళ్ళీ చేయడంలో టీడీపీ రాటుదేలిపోయింది.

ఇంతకీ, ఇలా ‘మూస’ ఆందోళనలు చేయడం వల్ల ఎవరికి లాభం.? ఇంకెవరికి, ముమ్మాటికీ ఆ లాభం వైసీపీ ఖాతాలోకే వెళుతుంది. లేకపోతే, గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకంత ఘోరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుంది. గుర్తులు లేని ఎన్నికల్లో, ‘మేం చాలా గెలిచేశాం..’ అంటూ ఎక్సెల్ షీట్లు విడుదల చేసుకున్న టీడీపీ, గుర్తులతో జరిగే ఎన్నికలొచ్చేసరికి చేతులెత్తేసిన విషయం విదితమే.

ఇప్పుడు కుప్పం సహా పలు స్థానిక ఎన్నికల విషయంలోనూ టీడీపీ పాత మూస గోలతోనే సరిపెడుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు.

స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీకే ఎడ్జ్ వుంటుంది. అది తెలిసీ, చంద్రబాబు తన హయాంలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించే విషయమై కొంత భయపడ్డారు. దానికి ఆయన తగిన మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ చేసిన యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తాము చేస్తే సంసారం.. ఇంకెవరన్నా చేస్తే వ్యభిచారం.. అన్న ధోరణిలో టీడీపీ వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఇంత యాగీ చేసి, కుప్పంలో టీడీపీ ఏమవబోతోంది.? ఇంకేమవుతుంది.. అభాసుపాలవుతుందని తెలిసే కదా.. ఈ రగడ.?