తరచూ జరుగుతున్న చర్చే ఇది. రాజకీయాల్లోకి నేరస్తులు ఎలా రాగలుగుతున్నారని. ఏ రాజకీయ పార్టీ కూడా ‘నేరస్తులకి మేం టిక్కెట్లు ఇవ్వం’ అని చిత్తశుద్ధితో చెప్పలేవు. నేరస్తులు వేరు, నిందితులు వేరు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయాక, నేర చరిత్ర లేని రాజకీయ నాయకుడంటూ కనిపించడం కష్టం. అదే అతి పెద్ద సమస్యగా మారుతోంది. 48 గంటల్లోగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించడంతో ఒక్కసారిగా మళ్ళీ ‘రాజకీయాల్లో నేర చరితుల’ అంశంపై హాట్ హాట్ చర్చ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలూ నీతులే చెబుతాయ్. కానీ, ఎన్నికలొచ్చేసరికి, ఎవరి మీద ఎక్కువ కేసులున్నాయ్.. ఎవరు ఎక్కువగా ఓటర్లను భయపెట్టి, ఓట్లను లాగగలరు.? అన్న కోణంలో టిక్కెట్లు ఇస్తుంటాయ్. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వ్యవహారమే ఇది.
ఓటర్లకు ఇంకో ఆప్షన్ వుండటంలేదు. ఇండిపెండెంట్లు తప్ప, ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచినవారందరి మీదా కేసులు వుంటే.. ఓటర్లు మాత్రం చెయ్యగలిగేదేముంటుంది.? అన్నది ఓ వాదన. కేసులున్నంతమాత్రాన అందర్నీ నేరస్తులని అనగలమా.? నేరస్తుడిగా న్యాయస్థానం తేల్చి, శిక్ష విధించిన తర్వాత కూడా అప్పీల్ చేసుకునే అవకాశం దొరుకుతోంది.. పై కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడమో, స్టే తెచ్చుకోవడమో చేస్తుండడంతో.. నేరస్తులు కాస్తా నిందితులైపోతున్నారు. ఇలా కేసులున్న నేతలు, సమయానుకూలంగా పార్టీలు మార్చేస్తారు.. తమ కేసుల మాఫీ కోసం. కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతుండడంతో ఎవరు నేరస్తుడు.? ఎవరు నిందితుడు.? ఎవరి మీద అక్రమంగా కేసులు బనాయింపబడ్డాయి.? ఎవరు కేసుల నుంచి తప్పించుకోగలుగుతున్నారు.? అన్నదానిపై ప్రజల్లో గందరగోళం నెలకొంటోందన్నది ఇంకో వాదన. ఎవరి గోల వారిది. అంతిమంగా, నేరమయ రాజకీయాలైతే దేశంలో ఎక్కడ చూసినా ‘ఉన్నత స్థానంలో’నే కనిపిస్తాయి.