Ayyanna : అయ్యన్నా.. ఈ బూతులెందుకన్నా.?

Ayyanna :  నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందని అంటారు. కానీ, రాజకీయాల్లో నోరు ఎంత చెడ్డదైతే ఆ నాయకుడు అంత పాపులర్.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అలాంటివారికి రాజకీయాల్లో కీలక పదవులు కూడా దక్కుతున్నాయి. దాంతో, బూతులే రాజకీయానికి తొలి పాఠాలుగా చేసుకుంటున్నారు యువ నాయకులు చాలామంది.

యువ నేతలిలా బూతుల్లో పోటీ పడుతుండడంతో, సీనియర్ పొలిటీషియన్లు కూడా కొత్తగా బూతులు నేర్చుకోవాల్సి వస్తోంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహార శైలి కూడా అలాగే వున్నట్టుంది. లేకపోతే, రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న అయ్యన్నపాత్రుడు, ఈ మధ్యకాలంలో ఆ మంచి పేరుని చెడగొట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు.

ఆ మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ‘చెత్త నా డాష్..’ అంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి తెరలేపారు అయ్యన్న. అయ్యన్న వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ శ్రేణులు, టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే.

‘నేను విమర్శిస్తే నా మీదకు రావాలి.. అంతే తప్ప, పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా.?’ అంటూ అయ్యన్న తాజాగా మరోమారు తిట్ల దండకం అందుకున్నారు. ముఖ్యమంత్రి పైనా, డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ మీదా.. అయ్యన్న తాజాగా అవాకులు చెవాకులు పేలారు.

ఫలితంగా అయ్యన్న మీద ఇంకోసారి కేసు నమోదయ్యింది. అయితే, ఎన్ని కేసులుంటే అంత గొప్ప.. అనుకుంటున్నట్టున్నారు అయ్యన్న, తిట్ల దండకం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు.