రాష్ట్రంలో ఎన్నికల కమీషన్, ప్రభుత్వానికి నడుమ జరుగుతున్నా పంతం పోరు తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. హైకోర్టులో ఎన్నికల నిర్వహణ విషయమై రెండు రకాల తీర్పులు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇస్తే ఎన్నికలు పెట్టుకోవచ్చని డివిజనల్ బెంచ్ తీర్పు చెప్పింది. ఒక హైకోర్టు బెంచ్ ల తీర్పుల నడుమే ఇంత వ్యత్యాసం ఉండటంతో అందరిలోనూ ఒకటే కన్ఫ్యూజన్. హైకోర్టు చెప్పింది కాబట్టి ఆ తీర్పును శిరసా వహిస్తాం అంటూ ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే నోటిఫికేషన్ రావడానికి ముందే ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల మీద స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తక్షణమే విచారణ చేపట్టమని కోరింది. కానీ సుప్రీం కోర్టు సమయం లేదని అంటూ విచారణను సోమవారం జరుపుతామంది. మరి ఈ విచారణలో ఎలాంటి తీర్పు వస్తుంది, నిమ్మగడ్డ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో జగన్ ఏం చెయ్యబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. జగన్ ఏం చేసినా అది సోమవారం సుప్రీం చేపట్టబోయే విచారణ ఆధారంగానే ఉంటుందనేది ఖాయం. సాధారణంగా ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక సుప్రీం కోర్టు ఆ వ్యవహారంలో కలుగజేసుకోదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి అనేది ఈసీ సొంత నిర్ణయం. అందులో ప్రభుత్వ ఇష్టాయిష్టాలకు తావులేదు. ఈసీ ఎన్నికలు పెట్టినప్పుడు సిబ్బందిని సమకూర్చి వారికి సహకరించడమే వారి పని.
కానీ ఏపీ ప్రభుత్వం కరోనా, వ్యాక్సినేషన్ కారణాలు చూపి ఎన్నికలు నిలిపివేయాలని చూసింది. సోమవారం సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పు సహేతుకమేనని చెబితే తిరుగులేకుండా జగన్ సర్కార్ నిమ్మగడ్డను సిబ్బందిని సమకూర్చి ఎన్నికలకు వెళ్లాల్సిందే. అందులో ఇంకొక మాటకు తావులేదు. ఒకవేళ సిబ్బందిని ఇవ్వకుండా మొరాయిస్తే అది రాజ్యాంగ ధిక్కరణే అవుతుంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో.. జగన్ సర్కార్ అంతవరకు తెచ్చుకోదు. ఇక సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు చెప్పకుండా, స్టే ఇవ్వకుండా విచారణను కొనసాగించినా ఎన్నికలు యథావిధిగా జరిగిపోతాయి. అప్పుడు కూడ జగన్ చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ ఎన్నికలను ఆపాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం సుప్రీం కోర్టు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును తప్పని అంటూ స్టే ఇవ్వడమే. మరి కింది కోర్టు తీర్పును సుప్రీం తప్పుబడుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.