ఓ వ్యక్తిపై ఇంకో వ్యక్తి ఆరోపణలు చేస్తూ, కోర్టును ఆశ్రయిస్తే.. అందులో వాస్తవం వుందో లేదో న్యాయస్థానం తేల్చాలి. ఇరుపక్షాల వాదనలూ వినాలి. ఆరోపణలు వాస్తవమైతే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలుండాలి. ఆరోపణలు అవాస్తమని తేలితే, కనీసం మందలింపు అయినా ఆరోపణలు చేసిన వ్యక్తికి వుండాలి. మరి, జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ చేసిన ఆరోపణల వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతోంది.? సీఎం జగన్ చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే విచారణ జరిపారు. అది అంతర్గత విచారణ అట. విచారణ అనంతరం, ఎన్వీ రమణకు క్లీన్ చిట్ ఇస్తూ, జగన్ ఆరోపణల్ని కొట్టి పారేసిందట సర్వోన్నత న్యాయస్థానం. మరి, ఈ కేసులో జగన్ మీద చర్యలు వుంటాయా.? వుండవా.? మందలింపు అయినా వుంటుందా.? వుండదా.? అన్న ధర్మ సందేహం చాలామంది నెటిజన్లకు కలుగుతోంది.
సాధారణంగా కోర్టుల్లో రాజకీయ ఆరోపణలకు సంబంధించి, ఆరోపణల్లో వాస్తవం లేకపోతే, ‘కేసు కొట్టివేయబడింది’ అని మాత్రమే న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తుంటుంది. అవతలి వ్యక్తి పరువు నష్టం దావా వేస్తే, సీన్ ఇంకోలా వుంటుంది. సో, జగన్ ఆరోపణల వ్యవహారం కూడా ‘కొట్టివేత’కే పరిమితం కావొచ్చన్నది కొందరు న్యాయ పండితుల అభిప్రాయం. జస్టిస్ ఎన్వీ రమణ త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికీ వెళ్ళే అవకాశం దాదాపుగా వుండకపోవచ్చన్నది న్యాయ పరిశీలకుల, రాజకీయ పరిశీలకుల అంచనా. జస్టిస్ ఎన్వీ రమణ తరఫున ఇంకెవరైనా, జగన్‌కి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తేనో.? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏమో, ఏదైనా జరగొచ్చు. కానీ, అత్యంత తీవ్రమైన ఆరోపణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు, ‘రహస్యం’ పక్కన పెట్టి, వాస్తవాల్ని ప్రజల ముందుంచాలి కదా.? అన్న ధర్మ సందేహానికి మాత్రం ప్రజలకు సమాధానం దొరకడంలేదు.