ట్విట్టర్ బరితెగింపు.. మోడీ సర్కార్ ఇప్పుడేం చేస్తుందో.!

Twitter Again Did A Blunder Against India

Twitter Again Did A Blunder Against India

సోషల్ మీడియా భారతదేశం పాలిట శతృవుగా మారుతోందా.? అంటే, అవుననే చర్చ పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. భారతదేశం విషయమై సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఏదైనా దాదాపు ఒకటే తీరు. తాజాగా ట్విట్టర్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని.. భారతదేశ చిత్ర పటంలో చూపించలేదు.

ట్వీట్ లైఫ్ కేటగిరీలో ఈ తప్పిదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, ట్విట్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ ట్విట్టర్ ఈ తరహా ధోరణి ప్రదర్శించడంతో అప్పట్లో ట్విట్టర్ తీరుని తీవ్రంగా తప్పు పట్టింది భారత ప్రభుత్వం. ఇదిలా వుంటే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన సోషల్ మీడియా నిబంధనల్ని అమలు చేయడంలో ట్విట్టర్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్న విషయం విదితమే.

దీంతో, ట్విట్టర్ సహా పలు సామాజిక మాధ్యమాలపై వేటు వేయాలనే డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, అదంత తేలికైన వ్యవహారం కాదు. ట్విట్టర్ కావొచ్చు.. మరో సామాజిక మాధ్యమ వేదిక కావొచ్చు.. రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు గత కొంతకాలంగా అత్యద్భుతంగా ఉపయోగపడుతోంది.

రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లడానికీ, అసత్య ప్రచారం చేయడానికీ సామాజిక మాధ్యమాల్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఉపయోగించిన తీరు అందరికీ తెలిసిందే. బీజేపీ సైతం, కాంగ్రెస్ పార్టీ మీద.. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద సోషల్ మీడియా వేదికగా చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అందుకేనేమో, సామాజిక మాధ్యమాలు భారతదేశంలో అంతలా బలపడిపోయాయి.. కాదు బలిసిపోయాయి.

సోషల్ మీడియా ద్వారా జరుగుతోన్న మంచి కంటే, కలుగుతోన్న చెడు చాలా ఎక్కువన్న చర్చ ఇటీవలి కాలంలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశం కోసం ఎందాకైనా.. అంటూ నినదిస్తోన్న మోడీ సర్కార్, ట్విట్టర్ మీద బ్యాన్.. వంటి ఆలోచన చేయడం కంటే, ట్విట్టర్ తన బుద్ధిని మార్చుకోగలిగేలా కఠిన చర్యలు తీసుకుంటే కాదనేవారెవరు.?