తెలంగాణలో అత్యంత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలవుతోంది. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చేస్తున్నారు. నిజానికి, పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలూ ప్రశంసనీయమే. అయితే, తెలంగాణలో గత కొద్ది రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 4 వేల లోపు మాత్రమే రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా లాక్ డౌన్ వల్లనేనన్నది నిర్వివాదాంశం.
పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రపదేశ్.. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 20 వేలు ఆ పైన కేసులు రోజువారీగా నమోదవుతున్నాయి. కర్నాకటలో అయితే ఓ దశలో 50 వేల మార్కుని కూడా టచ్ చేసేసింది. మహారాష్ట్రతోనూ తెలంగాణకు సరిహద్దు వుంది. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ వుంది గనుకనే, ఇంత కఠినంగా తెలంగాణలో నిబంధనల్ని అమలు చేయాల్సి వస్తోంది. బోర్డర్ల వద్ద ఎప్పటికప్పుడు సరికొత్త ఆంక్షల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, మహారాష్ట్ర, కర్నటాక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలపై రాని విమర్శలు తెలంగాణలో లాక్ డౌన్ మీద మాత్రం వస్తున్నాయి. నిజానికి, కరోనా మొదటి వేవ్ సమయంలో.. సరిహద్దుల వద్ద తెలంగాణ ప్రభుత్వం కాస్త ఉదారంగా, మానవీయ కోణంలోనే ఆలోచించింది. అయినా, అప్పట్లోనూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోనే వున్నాయి.
రెండో వేవ్ సందర్భంగా 10 వేల మార్కుని దాటిన తెలంగాణ, ఆ తర్వాత లాక్ డౌన్ నిర్ణయంతో.. క్రమంగా కోలుకుంది. అందుకే, ఇంకోసారి కరోనా, తెలంగాణపై పంజా విసరకూడదన్న కోణంలోనే కఠిన ఆంక్షలు. కానీ, మెట్రో నగరం హైద్రాబాద్ మీద ఎన్నో ఆశలతో ఇక్కడే స్థిరపడ్డ చాలామంది కార్మికులు, ఇతర ఉపాధి పనుల మీద వచ్చినవారు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే మంచిదేమో.