Tdp And Ysrcp : వివేకా పేరుతో వైసీపీకి టీడీపీ ‘పబ్లిసిటీ’ చేసి పెడుతోందా.?

Tdp And Ysrcp :సీబీఐ విచారణ జరుగుతోంది.. అందులో చాలా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయంటూ మీడియాకి లీకులు అందుతున్నాయి. అక్రమాస్తుల కేసు విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్న విమర్శల కంటే తీవ్రమైనవేమీ కావివి.

అప్పట్లో ఆ కేసు ఎలాగైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సింపతీ వేవ్ తీసుకొచ్చిందో, ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సింపతీ తీసుకొచ్చేలా వుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

నిజానికి, సీబీఐ విచారణ అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి అయి వుండీ, కేసులో నిజాలు నిగ్గు తేల్చలేకపోవడం, బాబాయ్ హత్య కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోలేని అచేతనావస్థ.. ఇలాంటి విమర్శలు వైఎస్ జగన్ మీద వున్నాయ్. వాటన్నిటినీ ఇప్పుడు ఈ సీబీఐ విచారణ కారణంగా వెలుగు చూస్తున్న లీకులు డామినేట్ చేసేస్తున్నాయ్.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ మార్కు కుట్ర ఇంకోసారి జరుగుతోందన్న అభిప్రాయం కింది స్థాయిలోకి వెళుతోంది. సీబీఐ ఎక్కడా అధికారికంగా ఏ విషయమూ ప్రకటించకపోయినా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ‘లీకు’ ప్రచారమే ఇందుకు కారణం.

జరుగుతున్న పరిణామాల్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సరైన సమయంలో సరైన విధంగా ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు వైఎస్ జగన్ తగిన వ్యూహాల్ని సంసిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాల్ని టీడీపీ బాయ్ కాట్ చేసే అవకాశం వున్నందున, అక్కడ కూడా అధికార పార్టీకి ఈ కేసు విషయమై పెద్దగా సమస్యలు వుండకపోవచ్చు.