TDP Mind game : జనసేనపై మైండ్ గేమ్ మొదలు పెట్టిన టీడీపీ.!

TDP Mind game : ‘మాకు మీరు మద్దతివ్వాల్సిందే. మీకు మరో ఆప్షన్ లేదు. కలిసి పని చేద్దాం. మేం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని బాగా చూసుకుంటాం..’ ఇదీ తెలుగుదేశం పార్టీ షురూ చేసిన మైండ్ గేమ్.! జనసేన పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మొదలెట్టిన ఈ మైండ్ గేమ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి, స్థానిక ఎన్నికల సమయంలోనే టీడీపీ ఈ మైండ్ గేమ్ అమల్లోకి తెచ్చింది. కానీ, అప్పట్లో జనసేన.. టీడీపీకి లొంగలేదు. దాంతో జనసేన దార్లోకి టీడీపీనే వెళ్ళాల్సి వచ్చింది.

స్థానిక ఎన్నికలు వేరు, సార్వత్రిక ఎన్నికలు వేరు. ఎప్పుడైతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదన్న ప్రకటన జనసేనాని నుంచి వచ్చిందో, దానర్థం జనసేన – టీడీపీ – బీజేపీ కలిసి పని చేయడమేనన్న అభిప్రాయానికి టీడీపీ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కింది స్థాయి టీడీపీ నేతలు, జనశ్రేణుల్ని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసేశాయి.

మరీ ఇంత వేగంగానా.? అని జనసేన శ్రేణులు, టీడీపీ నేతల అత్యుత్సాహంపై ఆశ్చర్యపోతున్నారు. ‘మా అధినేత చెప్పింది వేరు.. మీకు అర్థమయ్యింది వేరు..’ అంటూ జనసైనికులు, తమ వద్దకు వస్తోన్న టీడీపీ నేతలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా, టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా జనసేన – బీజేపీ – టీడీపీ కలిసిపోయినట్లేనంటూ ప్రచారం చేసేస్తుండడం గమనార్హం.

ఈ తరహా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. గతంలోనే ఈ విషయం ప్రూవ్ అయ్యింది. 20‌19 ఎన్నికల్లో జనసేనకు తక్కువ ఓట్లు రావడానికి కూడా ఈ టీడీపీ వ్యూహమే కారణం. ఇంకోసారి అదే వ్యూహాన్ని 2024 ఎన్నికల కోసం చంద్రబాబు రచిస్తున్నారన్నమాట.