బుధవారం జరిగిన శాసన మండలిలో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుందో తెలిసిందే. తేదాపా నేతలు-వైకాపా నేతలు ఒకరికొకరు మాటలు విసురుకోవడానికే సరిపోయింది సమయమంతా. మాటలు, వాగ్వాదాలు, బాహాబాహీతోనే మండలి ముగిసింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లలకు సంబంధించిన అంశాలపై తేదాపా ఓటింగ్ కు కోరగా, నిబంధనలు ప్రకారం నోటీసును చైర్మన్ ఎలా పరిగణలోకి తీసుకుంటారని వైకాపా ప్రశ్నించింది. దీంతో అధికార -ప్రతిపక్షాల మధ్య యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి వెల్లంపల్లిని తేదాపా నేత బీద రవిచంద్రయాదవ్ కాలితో తన్నారంటూ వైకాపా ఆరోపించింది.
నారా లోకేష్ వైపు దూసుకొస్తుంటే ఆయన్ని అడ్డుకున్నారని తేదాపా ఆరోపణని తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో మండలి మధ్య మధ్యలో నిరవధికంగా వాయిదా పడేది. అటు నారా లోకేష్ మండలి లోపల చోటు చేసుకున్న సన్నివేశాల్ని తన ఫోన్ తో వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారని ఇంతలో వైకాపా మంత్రులు కన్నబాబు వెల్లంపల్లి ఫిర్యాదులు చేసారు. ఈ సమయంలో ఇరు పార్టీ నేతల మధ్య మరోసారి బాహాబాహీ తలెత్తింది. అంతకు ముందు మంత్రి అనీల్ కుమార్ యాదవ్, టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో అనీల్ తొడ గొట్టడాలు..మీసం మెలేయడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మరి నిన్నటి శాసనమండలి ఎవరికి ఉపయుక్తంగా ఉన్నట్లు? అంటే ఆసక్తికర విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదం పొంది మండలికి చేరింది కాబట్టి అక్కడ ప్రవేశ పెట్టకపోయినా ఇబ్బందేమి లేదని శాసనసభ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఆర్ధిక బిల్లు ఏదైనా మండలికి వచ్చిన రోజు నుంచి 14 రోజులు లోగా అక్కడ ఆమోదం పొందినా పొందకపోయినా ఆమెదించిన ట్లుగా పరిగణించి గవర్నర్ కి పంపుతారని అంటున్నారు. ఇలాంటి బిల్లులకు దిగువసభ ఆమోదమే కీలకంగాఉంటుందం టున్నారు.పార్లమెంట్ నిబంధనల ప్రకారం ద్రవ్యబిల్లును లోక్ సభ ఆమోదించి రాజ్యసభకు పంపినప్పుడు 14 రోజుల్లో సిపార్సులతో గానీ, యాథాతథంగా గానీ ఆ బిల్లును ఆమోదించి పంపాలి.
రాజ్యసభ సిపార్సులో కొన్నింటిని గానీ, అన్నింటిని గానీ లోకసభ ఆమోదించవచ్చు లేదా పక్కనపెట్టొచ్చు. తిప్పి పంపకపోతే ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. కాబట్టి దాదాపు ఇవే నిబంధనలు శాసన మండలికి వర్తిస్తాయని అంటున్నారు. ఇక సీఆర్ డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలికి రెండవసారి ఆమోదానికి వెళ్లాయి. మండలి ఎజెండాలో బిల్లులు చేర్చినా వాటిని సభలో ప్రవేశ పెట్టలేదు. ఎలాగు సభలోకి వచ్చాయి కాబట్టి నెల రోజుల్లో అవి కూడా ఆమోదం పొందినట్లుగానే అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరి వైకాపా వాదన నిజమైతే తేదాపాకి పంచ్ పడినట్లే. అయితే ఇక్కడ తేదాపా వాదన మరోలా ఉంది. గతంలో అవి మండలికి వచ్చినప్పుడు చైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపారు కాబట్టి ఆ వ్యవహారం ఇప్పట్లో తేలదంటున్నారు. మరి ఈ పరిస్థితులను వైకాపా ముందే ఉహించి ఇలా కొత్త వ్యూహంతో ముందుకొచ్చిందా? లేక? తేదాపా ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయిందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.