YS Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈయనని నమ్మి ప్రజలు తనని ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ ఈయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లే ప్రజల సమస్యలను ప్రశ్నించాల్సింది పోయి తనకు ప్రతిపక్ష నేతగా హోదా కావాలని అడుగుతున్నారని షర్మిల మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఎలాగో గెలవలేదు కనీసం ప్రతిపక్ష హోదా పొందడం కోసమైనా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని పరిస్థితిలో వైఎస్ జగన్ ఉన్నారని షర్మిల మండిపడ్డారు. ఇలా ప్రతిపక్ష హోదా అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి ఎమ్మెల్యే పదవి ఎందుకు అంటూ ఈమె ప్రశ్నించారు.కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. పేద ప్రజల కోసం కడప అభివృద్ధి కోసం దివంగత నాయకుడు వైయస్సార్ గారు కడప స్టీల్ ప్లాంట్ తీసుకువచ్చారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి అయితే ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని షర్మిల తెలిపారు. వైయస్సార్ తర్వాత ఎంతోమంది నాయకులు వచ్చిన కడప స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తలేదని షర్మిల మండిపడ్డారు.
ఇక 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని షర్మిల దుయ్యబట్టారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని ఆస్కార్ లెవెల్లో జగన్ డైలాగులు చెప్పారని ఎద్దేవా చేశారు. ఇక పది సంవత్సరాలపాటు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారని ఈమె తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించారు.